జాతీయ రోయింగ్‌లో టీఎస్ఎస్ పతకాల పంట
5 స్వర్ణాలు సహా 9 పతకాలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్, జాతీయ స్కూల్స్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్) క్రీడాకారులు సత్తా చాటారు.
ఐదు బంగారు పతకాలు సహా తొమ్మిది పతకాలు సాధించారు. జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు ఇటీవల కోల్‌కతాలో జరిగాయి. ఈ పోటీల్లో బాలుర టీమ్ విభాగంలో రెండు స్వర్ణా లు, కాంస్యం, బాలికల టీమ్ విభాగంలో ఒక్కో పసిడి, కాంస్యం టీఎస్ఎస్ రోయర్లు గెలిచారు. అక్కడే జరిగిన జాతీయ స్కూల్ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో బాలుర సింగిల్స్ స్కల్ ఈవెంట్లో సి.హెచ్. నవీన్ బంగారు పతకం గెలుచుకోగా... విజయ్, త్రినాథ్, సునీల్, ఆరిఫ్, గణేష్‌లతో కూడిన జట్టు టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలిచింది.
బాలికల సింగిల్స్ స్కల్ ఈవెంట్లో గీతాంజలి కాంస్యం దక్కించుకుంది. బాలికల టీమ్ విభాగంలో సీతా మహాలక్ష్మి, లక్ష్మీప్రసన్న, అర్చన, మనస్విని, ప్రియాంకలతో కూడిన బృందం రజతం గెలిచింది. జాతీయ రోయింగ్ పోటీల్లో పతకాలను గెలిచిన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) మేనేజింగ్ డైరె క్టర్ రాహుల్ బొజ్జా, రాష్ట్ర రోయింగ్ కోచ్ చక్రవర్తి అభినందించారు.