తెలంగాణకు మూడు రజతాలు
రోయింగ్‌లో రాణింపు
* ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్‌కు రజతం
* జాతీయ క్రీడలు
తిరువనంతపురం: తొలిసారి జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్రం పతకాల వేట ప్రారంభించింది. క్రీడల రెండో రోజున రోయింగ్‌లో తెలంగాణకు మూడు రజత పతకాలు లభించాయి. పురుషుల కాక్స్‌వెయిన్స్ లెస్ పెయిర్స్ విభాగంలో మంజీత్ సింగ్-దవీందర్ సింగ్ జంట రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది.
పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ 2000 మీటర్ల విభాగం ఫైనల్లో జస్కరణ్ సింగ్-కన్నన్ ద్వయం కూడా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల కాక్స్డ్ ఎయిట్ 2000 మీటర్ల ఫైనల్ రేసులో ప్రశాంత్ నాయర్, హరీష్ పూనాటి, దలీప్ షెఖావత్, అనిల్ సిలోట్, మంజీత్ సింగ్, శ్రీకాంత్ వెల్ది, బీరి సింగ్, ప్రవీణ్, దవీందర్ సింగ్‌లతో కూడిన తెలంగాణ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెల్చుకుంది. టెన్నిస్ టీమ్ విభాగంలో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.
సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్, కాజా వినాయక్ శర్మ, షేక్ అబ్దుల్లాలతో కూడిన తెలంగాణ పురుషుల జట్టు 2-0తో హరియాణాపై నెగ్గగా... నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి, ఇస్కా తీర్థలతో కూడిన తెలంగాణ మహిళల జట్టు 2-0తోనే హరియాణా జట్టును ఓడించింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో పతకం లభించింది.
తొలి రోజున శ్రీనివాసరావు స్వర్ణం, బంగారు ఉష, వెంకటలక్ష్మీ కాంస్యాలు అందించగా... రెండో రోజున విజయనగరం జిల్లాకే చెందిన రామకృష్ణ 69 కేజీల విభాగంలో రజతం సాధించాడు. రామకృష్ణ స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 157 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 281 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు