సివిల్స్‌తో సమాజసేవకు అవకాశం
నరసరావుపేట రూరల్,న్యూస్‌లైన్: సాఫ్ట్వేర్ ప్రపంచం కుటుంబానికే పరిమితమైతే సివిల్స్ వల్ల సమాజానికి సేవచేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. జొన్నలగడ్డ శివారు అమరా ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియం ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రోజారాణి అధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథి లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 700 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారని, అందరూ సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గుచూపితే సమాజసేవలో ఎవరు పాల్గొంటారని ప్రశ్నించారు.
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిలభారత సర్వీసులు సాధిస్తే సమాజసేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది తమ కళాశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సింపోజియంలో అనేక ప్రాంతాల ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించి ఉన్నతస్థానాలను అధిరోహించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తొలుత ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మొద టిరోజు సింపోజియంలో పేపర్, పోస్టర్ ప్రజంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో క్విజ్ పోటీలు నిర్వహించారు.