గొట్టిముక్కల ఎగువన రెండు జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గొట్టిముక్కలకు ఎగువన లోయ తరహాలో ఉన్న ప్రాంతాల్లో రెండు జలాశయాలను నిర్మించాలని జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీలను కేటాయించారని.. కానీ ఆ నీటితో ప్రతిపాదించిన 5.30 లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ–2 ద్వారా నీళ్లు అందుతున్నాయని వివరించింది. అందువల్ల ఈ 45 టీఎంసీల నీటిని స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి రెండు జలాశయాలను నిర్మించాలని కోరింది.గోదావరి–కావేరి అనుసంధానంపై శుక్రవారం జలసౌధలో తెలంగాణతో ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించింది. ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీఈ దేవేందర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాస్, రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు. భేటీలో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అనుసంధానం ప్రాజెక్టుపై రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను వివరించారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సాగునీటి సరఫరా కోసం 250 టీఎంసీలు అవసర మని చెప్పారు. అందువల్ల ప్రాజెక్టు ద్వారా తరలించే నీటిలో 50 శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు.రాష్ట్రం చేసిన విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవీ..⇒ నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా నీటి తరలింపు కోసం ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని మా అధ్యయనంలో తేలింది. సమ్మక్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలి. రాష్ట్ర అవసరాల కోసం సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల వరకు నిల్వలను సంరక్షిస్తూ ఆపై నిల్వలను మాత్రమే తరలించాలి. తెలంగాణకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు కింద 70 టీఎంసీలు, సమ్మక్క ప్రాజెక్టు కింద 50 టీఎంసీలు, దేవాదుల కింద 38 టీఎంసీలు కలిపి మొత్తం 158 టీఎంసీల అవసరాలు ఉన్నాయి. వాటిని సంరక్షించాలి. సీతమ్మ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి అవసరమైన కనీస నిల్వలను కాపాడాలి.⇒ సమ్మక్క బరాజ్‌లో 87 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేస్తే ఛత్తీస్‌గఢ్‌లో జరిగే ముంపు విషయంలో ఆ రాష్ట్రాన్ని ఒప్పించే బాధ్యతను ఎన్‌డబ్ల్యూడీఏ తీసుకోవాలి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలే 148 టీఎంసీల గోదావరి జలాలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించనున్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై ఆ తర్వాతే సంతకాలు చేస్తాం.⇒ అనుసంధానం ప్రాజెక్టులో కాల్వలు, సొరంగాల కోసం సేకరించాల్సిన భూముల్లో రెండు పంటలు పండే ఆయకట్టు భూములున్నాయి. రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రం నిర్మించనున్న కాల్వల వ్యవస్థనే అనుసంధానం ప్రాజెక్టు అవసరాలకూ వాడుకోవాలి.⇒అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కావేరికి తరలించాలని ప్రతిపాదించారు. అయితే కీలకమైన కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు వచ్చే వరకు సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోరాదు. సాగర్ నిర్వహణ ప్రొటోకాల్‌తోపాటు ఏపీ, తెలంగాణలకు నీటి కేటాయింపులపై స్పష్టత వచ్చాకే ఈ విషయంలో ముందుకు వెళ్లాలి.50 శాతం వాటా మినహా మిగతావి ఓకే: ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలనే డిమాండ్ విషయంలో పట్టువీడాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ కోరారు. రెండు కొత్త జలాశయాల నిర్మాణం, సమ్మక్క బరాజ్ నుంచే నీటి తరలింపు, ఛత్తీస్‌గఢ్ నుంచి సమ్మతి తీసుకోవడం తదితర అంశాలన్నింటి పట్ల సానుకూలంగా ఉన్నామని తెలిపారు. తదుపరి చర్చల్లో ఈ అంశాలపై మరింత పురోగతి సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవాలని కోరారు.గౌరవెల్లి కాల్వల పనులకు అనుమతిసాక్షి, హైదరాబాద్: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు–ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఐఎఫ్ఎఫ్సీ) ప్రాజెక్టులోని ప్యాకేజీ– 7లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం కోసం రూ.431.30 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమ తులు జారీ చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. హుస్నాబాద్, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల పరిధి లోని 1,06,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ఈ పనులు చేపట్టనున్నారు. భూసేకరణలో పురోగతితో సంబంధం లేకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.