డీపీఆర్ సిద్ధం..! | damanganga- pinjal river project is ready | Sakshi
Sakshi News home page

డీపీఆర్ సిద్ధం..!

Published Sun, May 11 2014 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

damanganga- pinjal river project  is ready

ముంబై: దామన్‌గంగా-పాంజల్ నదులను అనుసంధానించడం ద్వారా ముంబైకర్ల భవిష్యత్ నీటి అవసరాలను తీర్చే బృహత్తర పథకానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక(డీపీఆర్) సిద్ధమైంది. జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ఇందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది. రెండు జలాశయాలు, సొరంగమార్గ నిర్మాణం చేపట్టి దామన్‌గంగా, పాంజల్ న దులను అనుసంధానించడం ద్వారా ముంబైకి ఏడాదికి 579 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తీసుకురావొచ్చనేది ఈ పథకం లక్ష్యం. దామన్‌గంగా నదిలోని మిగులు జలాలను పాంజల్ బేసిన్‌కు మళ్లిస్తారు. ఇందుకోసం మూడు జలాశయాలను, రెండు సొరంగ మార్గాలను నిర్మిస్తారు. తద్వారా నగరానికి తరలించే ఈ నీటిని ముంబైలోని గృహ వినియోగ అవసరాలకు ఉపయోగిస్తారు.

 ఈ విషయమై ఎన్‌డబ్ల్యూడీఏ డెరైక్టర్ జనరల్ ఎస్ మసూద్ హుస్సేన్ మాట్లాడుతూ... ‘ముంబైకర్ల దాహార్తిని తీర్చే ప్రాజెక్టుల్లో ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్టు. భవిష్యత్తులో ముంబైకర్ల నీటి అవసరాలు గణనీయమైన స్థాయిలో పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఇటువంటి పథకాల అమలు వేగవంతం చేయాల్సిన అవసరముంద’న్నారు. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 2041 నాటికి నగర అవసరాల కోసం రోజుకు 6680 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం నగరానికి సరఫరా అవుతున్న నీటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

 కాగా దామన్‌గంగా-పాంజల్ నదులను అనుసంధానించడం ద్వారా రోజుకు 1,600 మిలియన్ లీటర్ల నీటిని నగరానికి తీసుకురావొచ్చు. దీనికి అదనంగా పాంజల్ జలాశయం నుంచి మరో 865 మిలియన్ లీటర్ల నీటిని తీసుకురావొచ్చు. దీంతో ఒక రోజుకు నగరానికి సరఫరా అయ్యే నీరు 2,450 మిలియన్ లీటర్లకు చేరుతుంది. 2012లో 18  మిలియన్ల జనాభా అవసరాలను తీర్చేందుకు రోజకు 4529 ఎంఎల్‌డీల నీరు అవసరమైంది. అయితే అప్పటికి రోజుకు 3,675 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. డిమాండ్-సరఫరా మధ్య అగాధాన్ని పూడ్చేందుకు రోజుకు మరో 854 ఎంఎల్‌డీల నీరు అవసరమవుతోంది. దీంతో దామన్‌గంగాను పాంజల్‌కు అనుసంధానించడం ద్వారా నగరవాసుల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపుదిద్దుకుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement