ములాయం మాటలపై మంటలు
నోటీసులిచ్చిన జాతీయ మహిళా సంఘం
క్షమాపణ చెప్పాలన్న బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్
సంభాల్/బదౌన్ (యూపీ)/న్యూఢిల్లీ: అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధిస్తారా? అంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీనిపై జాతీయ మహిళా సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. భవిష్యత్లో ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరింది.
ఏఐడబ్ల్యూసీ, ఐద్వా లాంటి మహిళా సంఘాలు ములాయం వ్యాఖ్యలపై మండిపడ్డాయి. రాజకీయ ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ కూడా ములాయంకు మతిస్థిమితం తప్పిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటులు దియా మీర్జా, విద్యాబాలన్ యూపీ మాజీ సీఎం వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం ములాయం వ్యాఖ్యల్ని తానెందుకు ఖండించాలంటూ ప్రశ్నించారు. ఆయనపై సుప్రీం కోర్టు, రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ములాయం వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని, దేశంలో మహిళలందరికీ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా సంఘం చైర్మన్ మమతా శర్మ డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరూ ఇలా మాట్లాడబోరని ‘ఢిల్లీ నిర్భయ’ తండ్రి అన్నారు.
ములాయం నష్టనివారణ చర్యలు: దేశవ్యాప్తంగా తన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ములాయం నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దేశంలో మహిళలకు తామిచ్చినంత గౌరవం మరో పార్టీ ఇవ్వడంలేదన్నారు. అయితే శుక్రవారం ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల సభల్లో కూడా అత్యాచార చట్టంలో మార్పులు చేయాల్సిందే అంటూ తన వ్యాఖ్యల్ని కొనసాగించారు. తప్పుడు కేసులతో చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని, వారి వెనకుండి ఆ పని చేయిస్తున్న వారిని, అత్యాచార కేసుల్లో తప్పుడు నివేదికలు ఇస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షించాలన్నారు.
భారత సంస్కృతి కలుషితమవుతోంది: అజ్మీ
సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ.. ములాయం వ్యాఖ్యల్ని సమర్థించారు. పెళ్లికి ముందు లైంగిక చర్యల వల్ల దేశ సంస్కృతి కలుషితమవుతోందని చెప్పారు. హిందూ, ముస్లిం మతమేదైనా పెళ్లికి ముందు శృంగారాన్ని అంగీకరించవన్నారు. అయితే మహిళలు తప్పు చేసినా పురుషులకు మాత్రమే శిక్షలు పడుతున్నాయని ఆరోపించారు.
అజ్మీ వ్యాఖ్యల్ని ఆయన కుమారుడు ఫర్మాన్ వ్యతిరేకించారు. అత్యాచార ఉదంతంలో నిందితులను, బాధితురాలిని కూడా ఉరేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజ్మీపై సొంత కోడలు, ప్రముఖ నటి అయేషా టకియా నిప్పులు చెరిగారు. ‘మా మామగారు అలా అనుంటే ఆ మాటలకు మేం సిగ్గుపడుతున్నాం. ఈ వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా కించపరిచేవే. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారితో మేం వేగలేం’ అని టకియా ట్విట్టర్లో పేర్కొన్నారు.