అక్షరయానం అనంతయానం
నాకు నచ్చిన 5 పుస్తకాలు
నా డెబ్బై ఎనిమిదేళ్ళ జీవితకాలంలో నేను చదివిన పుస్తకాల చిట్టా చిన్నదేం కాదు. మావూరి గ్రంథాలయంలో లభించిన డిటెక్టివ్ పుస్తకాలతో మొదలైన నా పఠన ప్రయాణం నేటి ముఖపుస్తకం దాకా సాగుతూనే వస్తున్నది. మరపు మాటున మరుగు పడిన మన పఠనానుభవాన్ని తవ్వుకోవడం, అడుగు అడుగులో మొలకెత్తిన అనుభూతుల తొలి పచ్చికలను పొదవి పట్టుకోవడం అంత సులభసాధ్యం కాదు. కమ్మతెమ్మరలు మోసుకొచ్చే పుటల రెపరెపలు కర్ణ పుటాలను తాకుతుంటవి; కానీ కమ్మలు కనిపించవు. గ్రంథ సుమగంధాలు ఎడదను సోకుతుంటవి; కానీ పూల పుటాలు దోసిలికందవు. ఎద లోతుల మాగిన అక్షర సుగంధం అంగరాగమై పరిమళించడం మాత్రం తిరుగులేని వైయక్తిక వాస్తవం. నా జ్ఞాపకాల్లో నిలిచిపోయిన, పలు పుస్తకాల్లో నేను ఎంచుకునే 5 గ్రంథాలు:
మాలపల్లి: జాతీయోద్యమ కాలం నాటి గ్రామీణ సమాజం నేపథ్యంగా తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉన్నవ లక్ష్మినారాయణ గొప్ప ప్రబోధాత్మక నవల. అస్పృశ్యుల అరణ్య రోదనం, గాంధేయవాద స్థైర్యం, బడుగు జీవుల అచంచల ఔన్నత్యం అద్భుతంగా చిత్రించబడింది. ఆదర్శ కథానాయకుడు రామదాసు అనుభవించక తప్పని ఆనాటి బ్రిటిష్ జైళ్ల అశౌచ్య నరకాల జుగుప్స పాఠకుణ్ణి వెంటాడుతుంది.
పర్వ: కన్నడ సాహితీవేత్త భైరప్ప విశిష్ట ఉద్గ్రంథానికి ఆచార్య గంగిశెట్టి అద్భుత అనువాదం. ‘మహాభారతేతిహాసం’ ఆధునిక నవలగా రూపొందిన ‘మోడరన్ క్లాసిక్’. కృష్ణుడు, భీష్ముడు, పాండవులు, ద్రౌపది వంటి ఉదాత్త పాత్రలను సామాన్య స్థాయికి దించి, ఐతిహాసిక చీకటి కోణాలను, ప్రశ్నార్థకమైన ‘ఆర్యధర్మాన్ని’ కొత్త దృక్కోణంలో ఆవిష్కరించింది.
స్వరలయలు: ‘సంగీత శిఖరాలు’, ‘మలయమారుతాలు’ అందించిన సామల సదాశివ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వైభవం ఈ గ్రంథంలో మరింతగా విప్పారింది. ముచ్చట్ల మృదు భాషణంగా సాగిన లలిత శైలి. సంగీత ఘరానాల, గాయన రీతుల, గాత్ర సూక్ష్మాల విశేష విశ్లేషణ. సాంకేతిక జఠిలతలను సంగీతజ్ఞులకే వదిలేసి, శ్రావ్య సంగీత మాధుర్యాన్ని అలవోకగా అనుభవింపజేసే మెళకువ. పాఠకుణ్ణి శ్రోతగా మార్చి నేరుగా సంగీత వేదికల ముందుకు చేర్చే ఈ ‘స్వరలయలు’ స్వరసౌరభాల సంగతులను మోసుకొచ్చే లాలిత్య మారుతాలు.
మ్రోయు తుమ్మెద: విశ్వనాథ సత్యనారాయణ వైదుష్య భావధార కథన ప్రవాహమై ప్రవహించిన నవల. సారభూత భారతీయ తాత్వికతతో ప్రారంభమౌతుంది కథ. కరీంనగర్ కు చెందిన శాస్త్రీయ సంగీతజ్ఞులు నారాయణరావు జీవితకథ ఆధారంగా నడచిన నవలగా ప్రసిద్ధి. మా స్వగ్రామం ఎలగందుల సాంస్కృతిక చరిత్ర కూడా కొంత ఇందులో ప్రతిఫలించబడడం నన్నెంతో మురిపించిన ముచ్చట.
The Collected Poems of Octavio Paz:
ఆక్టేవియో పాజ్ వైవిధ్య కవితల సంకలనం. ప్రసిద్ధ దీర్ఘకవిత Sunstoneను అందగించుకున్న గొప్ప అధివాస్తవిక కవనఝరి. స్పానిష్ మూల రచనకు Eliot Weinberger ఆంగ్లానువాదం. మెక్సికన్ మూలవాసులైన ఆజ్టేక్ల సనాతన సంస్కృతీ పునాదుల మీద లేచిన అధునాతన సృజన వైభవం. సృష్టిలోని ప్రతి ప్రారంభ పయనం అంతిమంగా ఆది బిందువుకే తిరిగి చేరుతుందన్న తాత్వికతను పునరుద్ఘాటించిన కవితారూప ప్రతిఫలనం.
నాగరాజు రామస్వామి
nagaraju. ramaswamy @yahoo.com