పాక్లో దేశవ్యాప్త ఉగ్రవ్యతిరేక కార్యక్రమం
ఇస్లామాబాద్: దేశమంతటా విస్తరించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు పాకిస్తాన్ సైన్యం బుధవారం కొత్తగా రధ్–అల్–ఫసాద్(అపశృతికి అంతం) పేరిట ఉగ్రవ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల సింధ్ ప్రావిన్సులోని ప్రఖ్యాత లాల్ షాబాజ్ ఖలందర్ ప్రార్థన స్థలంపై దాడిచేసి ఉగ్రవాదులు 88 మంది ప్రాణాలు తీసుకున్న నేపథ్యంలో పాక్ ఈ భారీ కసరత్తుకు సన్నద్ధమైంది.
ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు పాక్ సరిహద్దు భద్రతే తమ లక్ష్యాలని పాక్ సైన్యం మీడియా విభాగమైన ‘ఇంటర్–సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్’ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరులో దేశ వైమానిక, నావిక, పౌర సాయుధబలగాలు.. సైన్యానికి బాసటగా నిలుస్తాయని ప్రకటన పేర్కొంది. లాహోర్లో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ భజ్వా నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భద్రతా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.