అద్భుతం! ఆ సిటీని మనుషులు కట్టలేదు!
సముద్రం అంతర్భాగంలో ఉన్న ఆ నిర్మాణాన్ని తొలిసారి గుర్తించిన డైవర్లు.. ఇదేదో ప్రాచీన నగరమై ఉంటుందని భావించారు. భవంతులు, వాటి చుట్టు ఉన్న ప్రాంగణాలు, ఎత్తైన ప్రాకారాలను పోలిన కట్టడాలను చూసి.. ఏ పూర్వ నాగరికతకు చెందిన నగరమో ఇది అయి ఉంటుందని, కాలక్రమంలో ధ్వంసమై సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అనుకున్నారు. ఈ కట్టడాలను గ్రీకు దేశంలోని జకింథోస్ వేసవి ద్వీపంలో ఇటీవల డైవర్స్ గుర్తించారు.
సముద్ర అంతర్భాగంలోని ప్రాచీన గ్రీకు నగరంగా మొదటి నుంచి భావిస్తున్న ఈ కట్టడాలకు సంబంధించి తాజా పరిశోధనలు అనేక విషయాలు వెలుగుచూశాయి. ఇది ప్రాచీన గ్రీకు నగరం కాదని, సహజసిద్ధంగా ఏర్పడిన కట్టడమని పరిశోధకులు గుర్తించారు. 50 లక్షల సంవత్సరాలకు పూర్వం నవీన రాతియుగంలో ఇది ఏర్పడి ఉంటుందని, ఇది ప్రకృతి చేసిన అద్భుతమని వారు తెలిపారు. సముద్రంలో గుర్తించిన ఈ ప్రదేశాన్ని మొదట మునిగిపోయిన ప్రాచీన నగరంగా భావించారని, కానీ అక్కడ ఎలాంటి జీవ ఉనికి లభించలేదని, ఇది సహజసిద్ధంగా ఏర్పడిన ప్రదేశమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్ ప్రొఫెసర్ జులియన్ ఆండ్య్రూస్ తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను జర్నల్ మెరీన్ అండ్ పెట్రోలియం జియోలజీ పత్రికలో ప్రచురించారు.