సీరియల్ కిల్లర్ అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 17న నవాబ్‌పేట పీఎస్ పరిధిలో రాజాపూర్ మండలం చొక్కంపేట్ గ్రామానికి చెందిన కటిక బాలరాజు (50)ను హత్య చేసిన ఘటనపై నవాబ్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి మహ్మద్ యూసుఫ్ అలియాస్ ఇసాక్‌ను బుధవారం కుల్కచర్ల మండలం చౌడపూర్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరాల ప్రకారం.. రాజాపూర్ మండలం చొక్కంపేట్‌కి చెందిన మృతుడు కటిక బాలరాజుకు తక్కువ ధరకు గొర్రెలను ఇప్పిస్తానని నిందితుడు మహ్మద్ యూసుఫ్ ఫిబ్రవరి 17న నవాబ్‌పేట శివారుకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత బాలరాజు కంట్లో కారంపొడి చల్లి హత్య చేశాడు. అతని దగ్గర ఉన్న రూ.14 వేలు తీసుకొని పరారయ్యాడు.
ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా గతంలో చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. యూసుఫ్‌పై 12 హత్య కేసులు, ఐదు దొంగతనం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో వికారాబాద్ హత్య కేసులో, హైదరాబాద్‌లోని 2 దొంగతనాల కేసులో మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. యూసుప్ నుంచి 4 బైక్‌లు, 3 సెల్ఫోన్లు, రూ.2,500 నగదు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ రివార్డులతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ భాస్కర్, రూరల్ సీఐ కిషన్, జడ్చర్ల సీఐ బాలరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నరబలి చేస్తాడని ప్రచారం..
అమాయక ప్రజలను, కూలీలను ఎంపిక చేసుకొని వారిని మహ్మద్ యూసుఫ్ అపహరించి ధనం కోసం నరబలి చేస్తుంటాడని ప్రచారం సాగుతోంది. నరబలి చేస్తే ధనం దొరకుతుందనే మూఢనమ్మకంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన హత్యలు అన్నింటినీ వాటికోసమే చేసినట్లు సమాచారం.