నక్సల్స్ ఎజెండా అంటూనే ఎన్కౌంటర్లు
పదవి భయంతోనే నయీంను ¯ హతమార్చారు
విరసం నాయకుడు వరవరరావు
శృతి, సాగర్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్
హన్మకొండ : నక్సల్స్ ఎజెండానే తన ఎజెండా గా చెప్పుకునే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎన్కౌంటర్లు చేయిస్తుండడం గర్హనీయమని విరసం నాయకుడు వరవరరావు అన్నారు. హన్మకొండ శ్యామలదుర్గాప్రసాద్ కాలనీలోని శ్యామల గార్డెన్స్‌లో శృతి, సాగర్ల సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభకు పో లీసులు అనుమతి నిరాకరించారు. దీంతో శృతి, సాగర్ తల్లిదండ్రులు తమ బిడ్డల సంస్మరణ సభను మైక్, వేదికపై ప్లెక్సీలు లేకుండానే నిర్వహించారు. సభలో వరవరరావు మాట్లాడుతూ తమ బిడ్డలను సామూహికంగా స్మరించుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించక పోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ఉండవని, నెత్తురు పారదని చెప్పి.. నెత్తురు పారిస్తున్నారన్నారు. శృతి, సాగర్‌ను సజీవంగా పట్టుకుని, అతి క్రూరంగా హింసించి మేడారం అడవుల్లో ఎన్కౌంటర్ చేశారని అన్నారు. అలాగే, నయీం సమాంతర పాలన నడిపిస్తున్నందునే ఆయనను సీఎం కేసీఆర్ ఎన్కౌంటర్లో చంపించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసినట్లుగా, తన మంత్రివర్గంలోని ఐదుగురితో కలిసి ఎక్కడ ముప్పు తెస్తారన్న భయంతో ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్‌గా మారిన చంద్రబాబును ప్రజ లు పక్కకు తప్పించారని గుర్తు చేస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇదే గతి పడుతుందని వరవరరావు పేర్కొన్నారు.
ఇక వరంగల్‌లో పోలీసులు పాలిస్తున్నారో, ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వ విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆ వైఖరిని విడనాడాలన్నారు. తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ నక్సల్స్ ఎజెండానే తన ఎజెండాగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శృతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సభలో శృతి తల్లిదండ్రులు మాధవి, సుదర్శన్, సాగర్ తండ్రి సుధాకర్‌రెడ్డి, కుల నిర్మూలన పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు భూరం అభినవ్, డీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్, ప్రజాసంఘాల నాయకులు శిల్ప, ఉదయ్‌సింగ్, మెట్టు రవీందర్, కోట శ్రీనివాస్‌రావు, యోగానంద్, మాధవి, జన్ను శాంతి, బద్రి, అనిల్, శాఖమూరి రవి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.