స్పీడు బ్రేకర్లు..బారికేడ్లు
కూసుమంచి: నాయకన్‌గూడెం వద్ద సాగర్ ఇన్‌ఫాల్ కాల్వలో సోమవారం తెల్లవారుజామున బస్సుపడి పది మంది దుర్మరణం చెందడంతో..ఇక్కడ అధికారులు తిరిగి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో స్పందించిన ఆర్అండ్బీ అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా..హడావిడిగా కాల్వ వంతెనపై రెయిలింగ్ విరిగిన చోట తాత్కాలికంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సూర్యాపేట వైపు, ఖమ్మం వైపు స్పీడు బ్రేకర్లను ఏర్పాటు చేశారు. పోలీసుశాఖ కూడా ఇన్‌ఫాల్ కాలువ వద్ద ట్రాఫిక్ పోలీసులను నియమించింది. వంతెనకు రక్షణ గోడలు నిర్మించేంత వరకు ఉదయం, రాత్రి వేళల్లో వీరు విధులు నిర్వర్తించనున్నారు. కాగా గతంలోనే బస్సు కాల్వలో పడి ప్రమాదం జరిగినప్పుడు అధికారులు స్పందించి ఉంటే ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు నాయకన్‌గూడెం వాసులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు. ఇకనైనా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు.