నయీమ్ గ్యాంగ్‌పై ఫిర్యాదు
- 8 ఎకరాలు తమకు రిజిస్టర్ చెయ్యాలని బెదిరింపులు
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
మేడ్చల్ రూరల్: నయీమ్ మరణించినా అతడి గ్యాంగ్ ఆగడాలు ఆగలేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోనూ అతడి ముఠా బెదిరింపులు వెలుగులోకి వచ్చారుు. కోర్టులో కేసు నడుస్తున్న స్థలంపై కన్నేసిన నయీమ్ గ్యాంగ్... ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి రిజిస్ట్రేషన్‌కు రావాలని బెదిరించినట్టు ఓ బాధితురాలు ఆదివారం మేడ్చల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్‌కి చెందిన వరలక్ష్మి భర్త బాలకృష్ణ 2003లో యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరులో 8 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. అనారోగ్యంతో ఆయన 2009లో మృతి చెందాడు. దీంతో వరలక్ష్మి ఘట్కేసర్ నుంచి మేడ్చల్‌లోని తన పుట్టింట్లో ఉంటోంది.
బాలకృష్ణ భూమిపై తమకూ హక్కుందని అతడి సోదరులు కోర్టుకెళ్లారు. ఘట్కేసర్కు చెందిన అంజయ్య నయీమ్ ముఠాకు ఈ సమాచారం ఇచ్చాడు. 8 నెలల క్రితం అంజయ్య, నయీమ్ ముఠా సభ్యులుగా చలామణి అవుతున్న భువనగిరి రాజు, న్యాయవాది కృష్ణ తదితరులు వరలక్ష్మి ఇంటికి వెళ్లి భయపెట్టి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకం చేరుుంచుకుని, రూ.50 వేలు ఇచ్చి వెళ్లారు. కొద్ది రోజులకు వరలక్ష్మికి రాజు ఫోన్ చేసి 8 ఎకరాలు తమకు రిజిస్ట్రేషన్ చేసేందుకు రావాలని చెప్పారు.
కానీ ఆమె వెళ్లలేదు. పలుమార్లు నయీమ్ ముఠా సభ్యులు ఫోన్ చేసి చంపుతామని బెదిరిం చారు. నయీమ్ ఎన్ కౌంటర్ అయిన వారం తరువాత న్యాయవాది కృష్ణ వరలక్ష్మికి స్థలం విషయమై లీగల్ నోటీసు పంపించాడు. అరుునా, ఆమె స్పందించకపోవడంతో నయీమ్ గ్యాంగ్ సభ్యులు ఫోన్లు చేసి చంపుతామని మరోమారు హెచ్చరించారు. దీంతో బంధువుల సూచన మేరకు వరలక్ష్మి ఆదివారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి
నయీమ్ కేసుపై బాధిత కుటుంబాలు
హైదరాబాద్: ‘నయీమ్‌తో మాకెలాంటి విభేదాలూ లేవు. అయినా మా కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి అతడు ఎందుకు చంపాడో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. ఇవన్నీ రాజ్యం చేయించిన హత్యలే’... ఇది గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితుల ఆవేదన. ఈ కేసును సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆదివారం ఇక్కడ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నయీమ్ బాధిత కుటుంబ సభ్యులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. నయీమ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌పై తమకు నమ్మకం లేదని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నయీమ్ బాధితుల ఫిర్యాదులు స్వీకరించాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వారిని కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే ఈ నెల 20న అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్ద బాధిత కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. నయీమ్‌ను పెంచి పోషించిన ఏపీ సీఎం చంద్రబాబును కూడా బోనులో పెట్టాలన్నారు.
బతికున్నారా... లేరా?: ‘తెలంగాణ విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో కీలకంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మల్లేశ్, వడ్డెర మనోహర్‌లను 2005లో ఎమ్మెల్యే చిట్టం నర్సింహారెడ్డి హత్య కేసులో సంబంధం లేకున్నా అరెస్టు చేశారు. 6 నెలల తరువాత జైలు నుంచి విడుదలైన వారిని దుండగులు అపహరించుకుని వెళ్లారు. ఇది నయీమ్ పనేనని తెలుసు. పోలీసులు, జాతీయ మానవహక్కుల కమిషన్... ఎవరికి ఫిర్యాదు చేసినా నేటికీ వారి ఆచూకీ లేదు.
అసలు బతికున్నారా... లేరా కూడా తెలియదు’ అంటూ మల్లేశ్ అన్న నర్సింహ, మనోహర్ తండ్రి తిమ్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. ‘పౌరహక్కుల సంఘం నేత, న్యాయవాది అయిన నా తండ్రి పురుషోత్తంను 2000లో దారుణంగా చంపారు. ఈ హత్యలో నయీమ్ ఉన్నాడనే వార్తలొచ్చాయి. అతడి డైరీలో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లూ ప్రజలముందుంచాలి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని స్వేచ్ఛ డిమాండ్ చేశారు.
నాటి ప్రభుత్వమే చేయించింది...
తమ సోదరి బెల్లి లలితను నయీమ్ ముఠా అతి దారుణంగా హత్య చేసిందని, అనంతరం తమ భర్తలను కూడా చంపారని బాలకృష్ణమ్మ, సరిత చెప్పారు. అప్పటి ప్రభుత్వమే ఈ హత్యలు చేయించిందన్నారు. తమ సోదరుడు కృష్ణయాదవ్ ఏమయ్యాడో ఇప్పటికీ తెలియదన్నారు. ‘13 ఏళ్ల క్రితం నా భర్త కర్రెం అంజప్పను కిడ్నాప్ చేశారు. నేటికీ ఆచూకీ లేదు. ఇది నయామ్ పనేనని అందరికీ తెలుసు. కానీ ఎవరూ పట్టించుకోలేదు’ అని అంజప్ప భార్య ఈశ్వరమ్మ తెలిపారు.