నాయినోరిపల్లెలో కుంగుతున్న భూమి..
వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నాయినోరిపల్లెలో భూమి కుంగిపోతోంది. దాంతో ఊరి జనం భయంతో వణికిపోతున్నారు. భూమి కుంగి తమ ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోనని శనివారం రాత్రి ఊరి ప్రజలందరూ పాఠశాల సమీపంలో కాస్త ఎత్తై ప్రదేశంలో గుమిగూడి జాగారం చేస్తున్నారు. ఇళ్లన్నీ ఖాళీచేసేశారు.
రెండు రోజులుగా ఆ పల్లెలో ని భూమి పెద్ద శబ్దాలు చేస్తూ కుంగిపోతోంది. బావి తవ్వినట్లు పెద్దపెద్ద గోతులు పడుతున్నాయి. నాయినోరిపల్లెలో మూడు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. పక్కనేఉన్న బుగ్గమల్లెశ్వరస్వామి ఆలయం వద్ద 15 చోట్ల భూమి కుంగింది. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పైకిరావడంతో భూమిలో పొరలు ఏర్పడి లోపలికి కుంగుతోందని అధికారులు అంటున్నారు. విషయం తెలిసిన జిల్లా ఉన్నతాధికారులు శనివారం ఆ గ్రామాన్ని సందర్శించారు. పైనుంచి పెద్ద పెద్ద గుండ్లు వేసినట్లు శబ్దం చేస్తూ భూమి కుంగుతున్న విషయం గమనించారు.