Nayudamma Award
-
Yelavarthy Nayudamma: అసమాన ప్రతిభావంతుడు
భారత తోళ్ల పరిశ్రమకు నిరుపమాన సేవలందించినవారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1922 సెప్టెంబరు 10న జన్మించారు. భారత్‌లో విద్యాభ్యాసం అనంతరం అమెరికా చర్మ శుద్ధి పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అద్భుత విజయాలను సాధించారు. తిరిగి మాతృ దేశానికి వచ్చి, తాను చదువుకున్న సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ ట్లో చేరి చివరకు దాని డైరెక్టర్ అయ్యారు. నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డీ హైడ్స్ వంటి వాటి కలయిక, నిర్మాణశైలిపై కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్లను పదును చేసే వినూత్న ఏజంట్స్‌గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అనేక పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. నాయుడమ్మ పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మంతో తయారైన వస్తువులకు విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అలీన దేశాలకు, ఇతర దేశాలకు మధ్య స్నేహవారధిగా నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచారు. నూతన లేబరేటరీలకు ప్రణాళికలు రచించి, స్వయంగా రూపకల్పన చేసి, స్థాపింప జేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్లను దేశ స్థాయిలో తొలిసారిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. ‘లెదర్ సైన్స్’ మాస పత్రికకు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్–ఛాన్స్ లర్గా (1981–1982), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పేరుప్రఖ్యాతులు పొందారు. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా పలు ఆఫ్రికా దేశాలలో తోళ్ళ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నాయుడమ్మ దేశానికి, మరీ ముఖ్యంగా తెలుగు జాతికీ ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు పొందారు. 1986 నుండి ఆయన పేరుమీద నెలకొల్పిన అవార్డును సైన్స్, టెక్నాలజీ రంగాలలో అపూర్వ ప్రతిభను చూపిన వారికి ఏటా అందిస్తున్నారు. – డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి (శాస్త్రవేత్త నాయుడమ్మ శతజయంతి) -
మహిళా శాస్త్రవేత్తలకు నాయుడమ్మ అవార్డు
- పురస్కారం అందుకున్న టెస్సీ థామస్, గీతా వరదన్ తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట అందించే ప్రతిష్టాత్మక అవార్డు 2014 సంవత్సరానికి ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ప్రదానం చేశారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ గీతా వరదన్ నాయుడమ్మ అవార్డు అందుకున్నారు. ఆదివారం రాత్రి గుంటూరుజిల్లా తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి నాయుడమ్మ ట్రస్ట్ చైర్మన్ ఆర్.సంపత్ అధ్యక్షత వహించారు. ప్రముఖ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్యమకారిణి, రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా ముఖ్య అతిథిగా హాజరై అవార్డును ఇరువురు శాస్త్రవేత్తలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టెస్సీ థామస్ ‘భారత్‌లో తయారీ-రక్షణ అవసరాలు-చొరవ’ అంశంపైనా, డాక్టర్ గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేశారు. సాంకేతిక విజ్ఞాన రంగంలో 2020కి ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించేంతగా అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయుడమ్మ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి, నాయుడమ్మ మనవరాలు, సినీ హీరో నాని సతీమణి అంజనా నాని, ట్రస్టు చైర్మన్ మాదల సుధాకర్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, ట్రస్ట్ కోశాధికారి సూరెడ్డి సూర్యమోహన్, ట్రస్టీలు కె. బలహరనాథ్ మూర్తి, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టెస్సీ థామస్, గీతా వరదన్‌లకు నాయుడమ్మ పురస్కారం
గుంటూరు: క్షిపణి మహిళగా ఖ్యాతి గడించిన అగ్ని ప్రాజెక్ట్ తొలి మహిళా డైరెక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(అడ్రిన్) తొలి మహిళా డైరెక్టర్ గీతా వరదన్ ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డును సంయుక్తంగా అందుకున్నారు. తెనాలి బోస్ రోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా అవార్డును వారిరువురికీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వై.నాయుడమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్.సంపత్ అధ్యక్షత వహించారు. మేనేజింగ్ట్రస్టీ పి.విష్ణుమూర్తి, డాక్టర్ నాయుడమ్మ మనుమరాలు అంజన నాని, మాదల సుధాకర్, ఎస్.సూర్యమోహన్, కె.బలహరనాథ్ మూర్తి, ఆర్.శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. (తెనాలి రూరల్) -
ఇద్దరు సైంటిస్టులకు నాయుడమ్మ అవార్డు
అవార్డు అందుకోనున్న టెస్సీ థామస్, గీతా వరదన్ తెనాలి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట వార్షికంగా అందించే ప్రతిష్టాత్మక అవార్డుకు ఇద్దరు మహిళా శాస్త్రవేత్తల్ని ఎంపిక చేశారు. 2014 సంవత్సరానికిగాను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డెరైక్టర్ డాక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ డాక్టర్ గీతా వరదన్‌లను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు. నాయుడమ్మ స్వస్థలమైన తెనాలిలో మార్చి 1వ తేదీ సాయంత్రం నూకల రామకోటేశ్వరరావు కల్యాణ కళాసదనంలో అవార్డు ప్రదానోత్సవ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా టెస్సీథామస్ ‘రక్షణరంగ అవసరాలు-చొరవ-భారత్ సంసిద్ధత’ అంశంపైనా, గీతా వరదన్ ‘దేశ అవసరాలు-రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ’ అంశంపైనా నాయుడమ్మ స్మారకోపన్యాసం చేస్తారు.