మీడియాతోనే సామాజిక మార్పులు జేసీ బాబూరావునాయుడు
ఏలూరు, న్యూస్‌లైన్ : సామాజిక మార్పులకు మీడియా యే ప్రధాన కారణమని జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు అన్నారు. ఏలూరు గవరవరంలోని సెంట్ ఆన్స్ మహిళా కళాశాలలో రెండు రోజుల పాటు ఏపీ ప్రెస్ అకాడమీ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయుల శిక్షణ తరగతుల ముగింపు సభలో సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పాలనారంగానికి మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని జేసీ అన్నారు. వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని చెప్పారు.
విలేకరి నిత్య విద్యార్థి
జిల్లా అదనపు ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ విలేకరి నిత్య విద్యార్థని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి అందించాల్సిన గురతర బాధ్యత వారిపై ఉందన్నారు. కొన్ని సందర్భాలలో పాత్రికేయుల నుంచి కీలక సమాచారం పోలీస్ శాఖ కూడా పొందుతుందని గుర్తుచేశారు. అయితే పరిశోధనాత్మక కేసులకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని సందర్భాలలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముందన్నారు. సభకు అధ్యక్షతన వహించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ తిరుమలగిరి సురేం దర్ మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని ప్రాంతాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటుచేస్తామని చెప్పారు.
పలు అంశాలపై శిక్షణ
సామాజిక విలువలు పాటిస్తూ పాత్రికేయునిగా తన పరిధిని గుర్తెరిగి ఏవిధంగా ఉండాలనే విషయంపై వల్లీశ్వర్ వివరించారు. ‘పరువు నష్టం కోర్టు ధిక్కారం’ అంశంపై రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న విలేకరులకు ధ్రువీకరణ పత్రం, కిట్లను జేసీ, సురేందర్, చంద్రశేఖర్ అం దజేశారు. ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఎస్ఏ హష్మి, జి.నాగరాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డెప్యూటీ డెరైక్టర్ రెహ్మన్, జిల్లా పౌరసంబంధాధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు, డివిజినల్ పౌరసంబంధాధికారి ఎం.భాస్కరనారాయణ, ఏపీఆర్వో పి.మాధవ్, సూపరింటెండెంట్ శ్రీగోవింద్ నాయక్ పాల్గొన్నారు.