ఐదు వేల కొత్త ఆటోలకు ఎన్సీఆర్ పర్మిట్లు
నోయిడా:నోయిడా నుంచి పరిసర నగరాలకు ప్రతి రోజూ రాకపోకలు సాగించేవారికి శుభవార్త. ఢిల్లీతోపాటు ఫరీదాబాద్‌కు ఇక్కడి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ అనుమతించింది. ఇందులోభాగంగా ఐదు వేల కొత్త ఆటోలకు ఎన్సీఆర్ పర్మిట్లు జారీచేసింది. ఈ ఆటోలకు ఎలక్ట్రానిక్ మీటర్లు ఉంటాయి. మిగతా ఆటోలకంటే భిన్నంగా కనిపించేందుకు వీలుగా వీటికి కలర్ కోడ్ కూడా ఉంటుంది. కాగా ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ తీసుకున్న తాజా నిర్ణయంపై మెట్రో రైళ్లపై ఆధారపడే ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల ఇప్పటిదాకా నగర ఆటోవాలాలతో వాగ్యుద్ధం చేసి విసిగిపోయిన ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని ఓ వరంగా భావిస్తున్నారు.ఇందువల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని వారంటున్నారు.
ఈ విషయమై ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ ‘ నా వృత్తిలో భాగంగా నిరంతరం నేను రాకపోకలు సాగిస్తుండాలి. ఇందులో భాగంగా మెట్రో రైళ్లపైనే ఆధారపడేవాడిని. కొద్ది కొద్ది దూరాలకు కూడా విధిలేని పరిస్థితుల్లో మెట్రోనే దిక్కయ్యేది. ఇందుకు కారణం ప్రత్యామ్నాయం లేకపోవడమే. మెట్రో స్టేషన్‌కు వెళ్లడం, టికెట్ కొనుగోలు చేయడం, దాని రాకకోసం ఎదురుచూడడం, ఆ తర్వాత గమ్యానికి చేరడం మామూలే. దీనికితోడు అక్కడి నుంచి నా గమ్యానికి చేరుకునేందుకు మళ్లీ ఆటోరిక్షాను ఆశ్రయించక తప్పేది కాదు. ఇందువల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇదంతా ఎందుకని నేను నేరుగా ఆటోలోనే వెళ్లిపోయేవాడిని. ఎంతో డబ్బు ఖర్చయినా కోరుకున్న సమయానికి నా గమ్యానికి చేరుకోగలిగేవాడిని.
అయితే ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ తాజా నిర్ణయం వల్ల నేను ఇకమీదట ఇక్కడి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకోగలుగుతాను. అందుకయ్యే చార్జీ కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఢిల్లీలో నేను ఆటో ఎక్కడానికే మొగ్గుచేపేవాడిని. ఈ సేవలు కనుక ప్రారంభమైతే మెట్రో రైళ్లలో ప్రయాణాలను తగ్గించుకుంటా’ అని చెప్పాడు. మానసి మరో నగరవాసి మాట్లాడుతూ ‘సెక్టార్1-6లో నా కార్యాలయం ఉంది. నేను సరై జుల్లేనా ప్రాంతంలో నివసిస్తా. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించడం అత్యంత ఇబ్బందికరంగా ఉంది. ఇందుకోసం ప్రతిరోజూ రెండు ఆటోలు మారక తప్పడం లేదు. ఇక మెట్రో రైలు మార్గం నాకు ఎంతమాత్రం సౌకర్యవంతంగా లేదు. ఒకవేళ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరేటపుడు ఆలస్యమైతే కచ్చితంగా ఆటోను ఆశ్రయిస్తా’అని తెలిపింది. కాగా కారు కొనుగోలు చేయలేని వారికి యూపీ రవాణా శాఖ నిర్ణయం వరంగా మారింది.