బడ్జెట్‌పై మార్కెట్ దృష్టి..!
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఈవారంలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఫిబ్రవరి 1న (శుక్రవారం) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అధికార ప్రభుత్వం సన్నద్ధమవుతుండగా.. ఈ బడ్జెట్లో వెల్లడికానున్న పలు కీలక ప్రతిపాదనలు దేశీ స్టాక్ సూచీలకు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. బడ్జెట్లో.. ప్రజాకర్షక పథకాలకే ఈసారి పెద్దపీట ఉండనుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రధాన సూచీలపై బడ్జెట్ ప్రభావం ఏ విధంగా ఉండనుందనే అంశంపై పలువురు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను పరిశీలించినట్లయితే.. ‘గ్రామీణ, వ్యవసాయ ఆధారిత రంగాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వనుంది.
చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు వెలువడనున్నాయని భావిస్తున్నాం.’ అని మినాన్స్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సీఈఓ అనురాగ్ భాటియా అన్నారు. బడ్జెట్ ఉన్నందున మార్కెట్లో ఈవారం అధికస్థాయి ఒడిదుడుకులకు అవకాశం ఉందని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ వ్యాఖ్యానించారు. ఈ ప్రధాన అంశానికి తోడు 31న జనవరి ఎఫ్ అండ్ ఓ ముగింపు ఉండడం, అంతర్జాతీయ అంశాల నేపథ్యంలో సూచీలు రేంజ్ బౌండ్లో కదలాడే ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అంచనావేసారు.
క్యూ3 ఫలితాల ప్రభావం..
మరో మూడు వారాలపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర క్యూ3(అక్టోబర్–డిసెంబర్) కార్పొరేట్ ఫలితాల వెల్లడి కొనసాగనుంది. అయితే.. ఈవారంలో 500 బీఎస్ఈ కంపెనీలు, నిఫ్టీ 50లోని 16 కంపెనీలు ఫలితాలును ప్రకటించనుండగా.. అధికశాతం బ్యాంకుల ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. సోమవారం కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలను ప్రకటించనున్నాయి. మంగళవారం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు వెలువడనున్నాయి. బుధవారం ఐసీఐసీఐ బ్యాంక్, గురువారం దేనా బ్యాంక్.. శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గణాంకాలు వెలువడనున్నాయి.
శనివారం సిండికేట్ బ్యాంక్ ఫలితాలు ప్రకటించనుంది. ఇక ఈవారంలోనే హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ లిమిటెడ్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలతో పాటు భారతీ ఎయిర్ టెల్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్, యూపీఎల్ దిగ్గజ సంస్థల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ దిశపై ప్రభావం చూపనున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఇక శుక్రవారం రోజునే ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల డేటా వెల్లడికానుంది.
ఈవారంలోనే ఫెడ్ సమావేశం
అమెరికా ఫెడరల్ రిజర్వు రెండు రోజుల సమావేశం మంగళవారం ప్రారంభంకానుంది. 29–30 తేదీల్లో జరిగే ఈ సమావేశం ద్వారా 2019 తొలి పాలసీ సమీక్షను యూఎస్ ఫెడ్ వెల్లడించనుంది. ఈఏడాదిలో రెండు సార్లు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉండగా.. దీర్ఘకాలం కొనసాగిన అమెరికా ప్రభుత్వ మూసివేత, నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థ, అమెరికా–చైనాల వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఫెడ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశంపై స్పష్టతలేదని రాయిటర్స్ ప్రచురించింది.
ఈ సమావేశం నుంచి వెలువడే కీలక నిర్ణయాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని ఏంజెల్ బ్రోకింగ్ అనలిస్ట్ ప్రథమేష్ మాల్య అన్నారు. అంతర్జాతీయ అంశాల పరంగా.. ఇదే వారంలో టెక్నాలజీ దిగ్గజాలైన ఆపిల్, మైక్రోసాఫ్ట్ ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోవైపు వెనిజులాలో రాజకీయ సంక్షోభం కారణంగా క్రూడాయిల్ ధరలు ప్రభావితం కానున్నాయని కమోడిటీ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఎఫ్ఐఐల నికర విక్రయాలు...
ఈఏడాది జనవరి 1–25 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ.5,880 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. అయితే, వీరు డెట్ మార్కెట్లో రూ.163 కోట్లను ఈకాలంలో పెట్టుబడి పెట్టారని తేలింది.