
'వ్యవసాయాన్ని దెబ్బతీసే కుట్ర'
హైదరాబాద్: వ్యవసాయాన్ని దెబ్బతీసే కుట్రకు ఎన్డీయే సర్కారు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. దీనికి తాజాగా పెంచిన యాభై రూపాయిల మద్దతు ధరే ఉదాహరణని మండిపడ్డారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సాగుకు దూరం అయితే.. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి ద్వారా వ్యాపారులకు మేలు చేయాలన్నది మోదీ ఎత్తుగడ అని షబ్బీర్ ఎద్దేవా చేశారు.
మద్దతు ధర పెంచాలని కేంద్రంపై టీఎస్ సర్కార్ ఒత్తిడి పెంచాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని షబ్బీర్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కారు క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ప్రకటించాలన్నారు. రుణమాఫీని విడతవారీగా కాకుండా రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలన్నారు.