డాక్టర్ నుంచి మతబోధకుడి దాకా!
వార్తల్లోని వ్యక్తి
ముంబై : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మొన్నటి ఉగ్రదాడి ఘటనతో తెరపైకి వచ్చిన పేరు జకీర్ నాయక్. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు జకీర్ ప్రసంగ వీడియోలే ప్రేరణగా నిలిచాయన్న ఆరోపణల నేపథ్యంలో.. అతని వ్యవహారాలపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొన్నటి వరకూ ఎవరికీ తెలియనీ ఈ జకీర్ హఠాత్తుగా ఎలా వార్తల్లోని వ్యక్తి అయ్యారు?
ముంబై కేంద్రంగా సందేశం
1965లో ముంబైలో పుట్టిన జకీర్.. ముంబై వర్సిటీ నుంచి వైద్యవిద్యలో డిగ్రీ అందుకున్నారు. చిన్నప్పటినుంచే ఇస్లాంలోని వివిధ తెగల విధానంపై బహిరంగంగానే విమర్శలు చేసేవారు. తర్వాత వహాబిజం (సున్ని మత విధానం) ప్రచారం చేశారు. 1991లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)ను, ముంబైలో ఇస్లామిక్ ఇంటర్నేషనల్ పాఠశాలను స్థాపించారు. పేద ముస్లిం యువతకు విద్యలో ప్రోత్సహించేందుకు యునెటైడ్ ఇస్లామిక్ ఎయిడ్ అనే సంస్థనూ ప్రారంభించారు.అనంతరం పీస్ టీవీ ద్వారా ఇస్లాం మత ప్రచారం చేస్తున్నారు. ఇతర బోధకుల్లా అరబిక్‌లో కాకుండా ఇంగ్లిష్‌లో, ప్రాంతీయ భాషల్లో మాట్లాడ్డం ఈయన ప్రత్యేకత. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనటం కూడా ముస్లిం యువత ఈయనపై అభిమానం పెంచుకునేందుకు కారణమైంది. అయితే.. పీస్ టీవీ ద్వారా ఈయన ఇతర మతాలపై విషం కక్కుతున్నారని.. ఇది సామరస్యాన్ని దెబ్బతీస్తుందని యూకే, కెనడా దేశాలు జకీర్‌పై నిషేధం విధించాయి.
జకీర్ ఆస్తులపై లోతైన విచారణ
న్యూఢిల్లీ: ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ ఆస్తులపై, ఇతను నిర్వహిస్తున్న ఐఆర్ఎఫ్ (ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్)కు వస్తున్న విదేశీ నిధులపైనా విచారణ మొదలైంది. విద్వేష వ్యాఖ్యలతో.. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాడనే ఆరోపణలపై అప్రమత్తమైన కేంద్రం జకీర్‌పై ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) కింద కూడా విచారణకు ఆదేశించింది. జకీర్ నడుపుతున్న పీస్ టీవీతో పాటు అనధికార సమాచారాన్ని ప్రచారం చేస్తున్న చానళ్ల ప్రసారాలను తక్షణమే ఆపాలని.. కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలపై లోతైన విచారణ కొనసాగుతోందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.