అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
రణస్థలం : కొవ్వాడలో ఏర్పాటు చేయతలపెట్టిన అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కొవ్వాడ అణువిద్యుత్ మాకొద్దు బాబు...ఉత్తరాంధ్రను శ్మశానం చేయెుద్దు బాబు..’ అనే నినాదంతో సీఐటీయూ, ప్రజా సంఘాలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం కొవ్వాడ వద్ద సముద్రతీర ప్రాంతంలో గోతులు తీసి అందులో దిగి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించి అధికారంలోకి రాగానే అనుకూల జీవోలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. భూకంపాల జోన్లో ఉన్న కొవ్వాడ ప్రాంతంలో అణుపార్కును ఏర్పాటు చేయాలని చూడడం దారుణమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, మైలపల్లి పట్టయ్య, కొమర లక్ష్మణరావు, ఎన్వీ రమణ, ఎస్.సీతారామరాజు, బాలి శ్రీనివాసరావు, ముంగం శ్రీనివాసరావు, మలిపెద్ది శ్యాంసుందరరావు, మైలపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.