‘అణు’వణువునా మోసం
రణస్థలం: అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై జీఓలు జారీ చేస్తూ 1991 నుంచి మోసగిస్తున్నారని కోటపాలేం, రామచంద్రాపురం గ్రామస్తులు వాపోయారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని శనివారం కోటపాలెంలో గ్రామసభ నిర్వహించారు. సభలో భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో దయానిధి, అణువిద్యుత్ పార్క్ చీఫ్ ఇంజినీర్ వెంకటరమేష్, సహాయ అధికారి దేవర, ఎంపీపీ గొర్లె విజయకుమార్, వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గొర్లె రాజగోపాల్లతో పలువురు పాల్గొన్నారు.
సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అణు విద్యుత్ పార్కు పెడితే కాకినాడ నుంచి ఒడిశా వరకు తీరం సర్వనాశనమైపోతుందన్నారు. అధికారులు చెబుతున్న మాటలూ మోసపూరితమని తెలిపారు. సర్పంచ్ ధనుంజయ మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే తానూ పని చేస్తానన్నారు.
రామచంద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ మాట్లాడుతూ అణుపార్క్పై స్పష్టత లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోటపాలేం గ్రామానికిచెందిన తిరుపతిరాజు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్ మాట్లాడుతూ తోటలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలన్నారు. ఎంపీపీ గొర్లె విజయకుమార్ మాట్లాడుతూ పరిహారంపై పార్టీలకు అతీతంగా అంతా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం చీఫ్ ఇంజినీర్ వెంకటరమేష్ మాట్లాడుతూ అణుపార్కుపై అనుమానాలు ఉంటే తనను సంప్రదించాలని తెలిపారు. సామాజిక సర్వేకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించి, ఆ బాధ్యతను ఈపీటీఐఆర్ సంస్థకు అప్పగించిందని అన్నారు. ఆ సంస్థ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే పార్కు నిర్మాణం ఉంటుందన్నారు. రియాక్టర్లో ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ రియాక్టర్ వాటికదే కూల్ అయ్యేలా డిజైన్ చేస్తారన్నారు. ఈ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రం నెలకొల్పడానికి ప్రభుత్వం కలెక్టర్ అకౌంట్కు రూ.500 కోట్లు జమ చేసిందని చెప్పారు. ఇక్కడ భూ సేకరణ మొదలు కావడంతోనే గుజరాత్ నుంచి అణుపార్కు ఇక్కడకు వచ్చిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అణువిద్యుత్ అధికారి దేవరా, తహశీల్దార్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.