ఫొటో ఎగ్జిబిషన్
రణస్థలం : కొవ్వాడ అణుపార్కుతో ఉత్తరాంధ్ర జిల్లాలకు జరగనున్న వినాశనంపై కోటపాలేం గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక సర్పంచ్ సుంకర ధనుంజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, సంజీవిని పర్యావరణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కూన రాము, సిటు నేతలు ఎన్‌వీ రమణ, పి.తేజేశ్వరరావు మాట్లాడారు. కొవ్వాడ అణుపార్కు ఉత్తరాంధ్రకు మరణ శాసనమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అణు విద్యుత్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ ప్రాంత ప్రజలు జీవితాలు సర్వ నాశనం అవుతాయని ప్రభుత్వం నిర్లక్ష్యంతో సొంత ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇటు ఒడిశాలోని ఛత్రపూర్ నుంచి అటు కాకినాడ వరకు సమస్త జీవకోటి నాశనం అవుతుందని పేర్కొన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్‌లో ఉందని ఇటువంటి చోట అణు పార్కు ఏర్పాటు చేయడం ఎంత మాత్రం సరికాదని అన్నారు. గుజరాత్‌లోని మితివర్ధిలో ప్రజలు వ్యతిరేకిస్తే ఆ ప్లాంట్‌ను గుజరాత్ నుంచి కొవ్వాడకు తరలించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీజేపీ, టీడీపీలు అణుపార్కును వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలోకి రాగానే తమ ధోరణిని మార్చడం ఎంత వరకు సరైనదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయుకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, ఎన్‌వీ రమణ, యు.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.