ఈ ఛాయాచిత్రాలు...కన్నీటి కథలు...పోరాట రూపాలు | A photo exhibition of acid attack survivors | Sakshi
Sakshi News home page

ఈ ఛాయాచిత్రాలు...కన్నీటి కథలు...పోరాట రూపాలు

Published Sat, Jun 22 2024 8:43 AM | Last Updated on Sat, Jun 22 2024 8:44 AM

A photo exhibition of acid attack survivors

వన్య్రన ప్రాణులపై ఆసక్తితో సరదాగా కెమెరాను చేతపట్టింది నాన్కీ సింగ్‌.అయితే ఇప్పుడు ఆమె దృష్ణి కోణం మారింది.తన కెమెరా ఇప్పుడు బాధితుల చేతిలో ఆయుధం. వారి పోరాట పటిమకు నిదర్శనం. సరదాగా ‘రీల్స్‌’ చేసే వయసులో సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది 22 సంవత్సరాల నాన్కీ సింగ్‌.దిల్లీకి చెందిన నాన్కీ సింగ్‌ యాసిడ్‌–ఎటాక్‌ సర్వైవర్‌ల జీవితాలను ‘ఏ జర్నీ టు ది మిర్రర్‌’ పేరుతో డాక్యుమెంటేషన్‌ చేసింది.ఈ ఛాయాచిత్ర ప్రదర్శన దిల్లీలోని స్టెయిన్లెస్‌ గ్యాలరీలో జరుగుతోంది.

అమ్మాయిపై యాసిడ్‌ దాడి జరిగింది... అనే వార్త చదివి ‘అయ్యో’ అనుకుంటాం. దాడి చేసిన దుర్మార్గుడిని తిట్టుకుంటాం. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం.

ఎవరి పనుల్లో వారు బిజీ కావడం వల్ల, ఎవరి లోకంలో వారు ఉండిపోవడం వల్ల ‘ఘటన తరువాత యాసిడ్‌ బాధితురాలి పరిస్థితి ఏమిటి?’ అనేదానిపై దృష్టి మళ్లదు.

‘సర్వైవర్‌’ అన్న సానుకూల మాటేగానీ యాసిడ్‌–సర్వైవర్‌లలో చాలామంది జీవితాలు నరక్రపాయంగా ఉంటాయి. సానుభూతికే పరిమితమైనవారు సహాయానికి ముందుకు రాకపోవచ్చు. అంతకుముందు వరకు ఆత్మీయులుగా ఉన్నవారు అందనంత దూరం జరగవచ్చు.

‘బతికాను సరే, ఎలా బతకాలి’ అనేది వారికి ప్రధాన సమస్య అవుతుంది. ఉద్యోగం చేయడం నుంచి సొంతంగా చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టడం వరకు ఏదీ సులభం కాదు.

యాసిడ్‌ దాడి బాధితుల గురించి ఎన్నో ఆర్టికల్స్‌ చదివిన నాన్కీసింగ్‌ తన కాలేజి అసైన్‌మెంట్‌లో భాగంగా వారి కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలను ప్రపంచానికి చూపించాలనుకుంది. అలా ‘ఏ జర్నీ టు ది మిర్రర్‌’ప్రాజెక్ట్‌ పట్టాలకెక్కింది. ఈ  ప్రాజెక్ట్‌ కోసం నోయిడాలోని చాన్వ్‌ అనే ఫౌండేషన్‌ ప్రతినిధులను సంప్రదించింది. యాసిడ్‌ దాడి బాధితులకు వైద్య, ఆర్థిక సహాయాలు అందించడంతో పాటు  పునరావాసం కలిగించే సంస్థ ఇది.

నాన్కీ ఎంతోమంది సర్వైవర్స్‌తో మాట్లాడింది. మొదట్లో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు.

అయితే పరిచయం స్నేహంగా మారిన తరువాత మనసు విపారు ఒక్కొక్కరిది ఒక్కోకథ.

కన్నీళ్లు తెప్పించే కథ.

చుట్టూ చీకటి కమ్ముకున్న క్లిష్ట సమయంలోనూ వెలుగు దారుల వైపు అడుగులు వేసిన కథ.

సబ్జెక్ట్‌తో ఫొటోగ్రాఫర్‌ మమేకం అయినప్పుడు చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వేగంగా వెళుతుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగా సాంకేతిక జ్ఞానాన్ని వాడుకుంది నాన్కీ.

ఉద్దేశపూర్వకంగానే బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఫొటోలు తీసింది. దీనికి కారణం కలర్‌ ఫొటోలు సబ్జెక్ట్‌కు అతీతంగా వేరే అంశాలపై దృష్టి మళ్లిస్తాయి.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు మాత్రం నేరుగా సబ్జెక్ట్‌పై దృష్టి పడేలా చేస్తాయి.

‘అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అంతకుమించిన నరకం లేదు అని చాలామంది అమ్మాయిలు నాతో పదేపదే చెప్పారు’ అంటుంది నాన్కీ సింగ్‌.

అలాంటి వారిలో ధైర్యం నింపింది నాన్కీ. ‘మీరేమీ తప్పు చేయలేదు. కష్టాలను తట్టుకొని మీరు చేస్తున్న జీవన  పోరాటం సాధారణమైనదేమీ కాదు’ అని చెప్పింది.

కాలేజి ప్రాజెక్ట్‌లో భాగంగా యాసిడ్‌ దాడి బాధితుల దగ్గరికి వచ్చిన నాన్కీ వారితో కలిసి ప్రయాణం చేస్తోంది. వారి కష్టాలను పంచుకుంటోంది.‘ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌లు వారి దగ్గర రావడం కొత్తేమీ కాదు. అయితే నేను మాత్రం ప్రాజెక్ట్‌కు అతీతంగా వారితో అనుబంధం పెంచుకోవాలనుకున్నాను. వారికి ఏది నచ్చుతుందో, నచ్చదో తెలుసుకోవాలనుకున్నాను. వారిని కేవలం బాధితులుగా చూడడం నాకు ఇష్టం లేదు’ అంటుంది నాన్కీ సింగ్‌.

తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారి దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తుంది. వారి బర్త్‌డేకు కేక్‌ కట్‌ చేయించి ఫొటోలు దిగుతుంది.

తన ఫొటో ఎగ్జిబిషన్‌ల ద్వారా యాసిడ్‌ దాడి బాధితుల కోసం నిధుల సేకరణ చేస్తోంది.

వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది నాన్కీ. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత దిల్లీలోని చాందిని చౌక్‌లాంటి ప్రాంతాల్లో  స్ట్రీట్‌ ఫొటోగ్రఫీ చేసింది. ఫొటోగ్రఫీలోని సాంకేతిక విషయాలపై పట్టుకోసం న్యూయార్క్‌లోని ‘స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌’లో చేరింది.

నాన్కీ సింగ్‌ ఇప్పుడు సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది. మహిళల హక్కుల నుంచి వారిపై జరుగుతున్న హింస వరకు ఎన్నో అంశాలపై ఫోటో ప్రాజెక్ట్‌లు చేస్తోంది.


వారి కుటుంబంలో భాగం అయింది...
‘ఎ జర్నీ టు ది మిర్రర్‌’ప్రాజెక్ట్‌ పూర్తికాగానే ‘ఇక సెలవు’ అనే మాట నాన్కీసింగ్‌ నోట వినిపించలేదు.‘మళ్లీ మళ్లీ కలుస్తుంటాను’ అన్నది నాన్కీ. అనడమే కాదు తనకు సమయం దొరికినప్పుడల్లా యాసిడ్‌ దాడి బాధితుల దగ్గరికి వెళుతుంది. వారితో సరదాగా కబుర్లు చెబుతుంది. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది.‘నాన్కీతో మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆమెతో మాట్లాడితే సంతోషమే కాదు ఆత్మస్థైర్యం కూడా వస్తుంది’ అంటారు యాసిడ్‌ దాడి బాధితులు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement