న్యాయం చేయండి
పెద్దోళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుంటామన్నాడు
వాళ్లుపోయాక వద్దంటున్నాడు..
న్యాయం కోరుతూ ఓ యువతి ఏఎస్పీకి వినతి
గొర్రెల కాపరి కష్టాన్ని లెక్క చేయక కుమార్తెను పీజీ వరకు చదివించాడు. పెళ్లి ఈడు రావడంతో సంబంధం చూసి నిశ్చితార్థం చేయించాడు. పెళ్లి కోసం గొర్రెల మందను ఓ కసాయికి విక్రయించాడు. అతను డబ్బులు ఇవ్వకపోగా, ఐపీకి దాఖలు చేసి నోటీసు పంపించాడు. దీంతో గొర్రెల కాపరి గుండెపగిలి తనువు చాలించాడు. ఉన్న ఒక్క కుమారుడూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ కుటుంబంపై జాలి చూపాల్సిందిపోయి నిన్ను పెళ్లి చేసుకునేది లేదని కాబోయే వరుడు యువతికి తెగేసి చెప్పాడు. దీంతో యువతి ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని ఆశ్రయించింది.
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్:
గుర్రంకొండ మండలం మాగన్నగారిపల్లెకు చెందిన వెంకటరమణ, రెడ్డెమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వెంకటరమణ గొర్రెలు మేపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి కష్టాన్ని గుర్తించిన పెద్దకుమార్తె ధనలక్ష్మి పీజీ, బీఎడ్ పూర్తి చేసింది. ఈమెకు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శ్రీనాథ్ (29)తో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు 2012 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. శ్రీనాథ్ ధనలక్ష్మితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. పెళ్లి త్వరగా చేయాలని వెంకటరమణ ఉన్న గొర్రెల మందను మదనపల్లెకు చెందిన ఓ కసాయికి విక్రయించాడు. ఆయన డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి ఐపీ దాఖలు చేశాడు.
ఐపీ నోటీసు ఇంటికి రావడంతో వెంకటరమణ షాక్‌కు గురై 2013 మే 11న గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఆ ఇంటికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసులే దిక్కయ్యాడు. తండ్రి చనిపోయిన ఆరు నెలలకే రోడ్డుప్రమాద రూపంలో శ్రీనివాసులు తనువు చాలించాడు. దీంతో ఇంటి బాధ్యతలను తల్లి రెడ్డెమ్మ తీసుకుంది. కుటుంబాన్ని పోషించుకోవాలనే పట్టుదలతో గొర్రెలను కొనుగోలు చేసింది. గొర్రెలు మేపుతుండగా ప్రమాదవశాత్తు బండరాయిపై పడడంతో కాలువిరిగి మంచానపడింది. ఇంతలోనే పెళ్లి కుమారుడు సైతం ఊహించని షాక్ ఇచ్చాడు. వైఎస్ఆర్ జిల్లాలోనే కట్నం మరింత ఎక్కువ ఇస్తామనడంతో మనసు మార్చుకున్నాడు. నీతో పెళ్లి అవసరం లేదని ధనలక్ష్మికి తెగేసి చెప్పేశాడు. యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కొన్ని రోజులు కుంగిపోయింది. ఎలాగోలా ధైర్యం కూడదీసుకుని పెళ్లి కుమారుడి సంగతి తేల్చేయాలని నిర్ణయించుకుంది. ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని మంగళవారం చిత్తూరులో కలిసింది. కన్నీరు మున్నీరవుతూ తన బాధను చెప్పుకుంది. వెంటనే స్పందించిన ఏఎస్పీ వాయల్పాడు సీఐకి ఫోన్ చేశారు. తక్షణమే కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు.