అమ్మ వచ్చే వేళ
పాతపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పాతపట్నంలో కొలువై ఉన్న నీలమణి దుర్గ అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారిని జిల్లా వాసులతో పాటు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు నిత్యం దర్శించుకుంటుంటారు.
400 ఏళ్ల చరిత్ర
నీలమణిదుర్గ అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ పాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఒడిశా పర్లాకిమిడిలో ఉన్న మహరాజులు పరిపాలన కోసం ఈ ప్రాంతం, టెక్కలిలో ఉన్న కోటకు వెళ్లే వారని ప్రతీతి. 1674 సంవత్సరం ప్రాంతంలో పర్లాకిమిడిను పరిపాలిస్తున్న గజపతి మహారాజకు చెందిన కూలీలు పొలం దుక్కి చేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం నాగలికి తగిలి బయటపడిందని స్ధానికంగా ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. అనంతరం అమ్మవారు మహరాజు కలలో కనిపించి.. ఆలయాన్ని నిర్మించాలని సూచించడంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
పాతపట్నం నీలమణిదుర్గ దసరా ఉత్సవాలకు వైభవంగా నిర్వహించడానికి దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఐ బి.వి.వి ప్రకాష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కోసం పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులను విధులు అందించనున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కుంకుమపూజ, కలశపూజ, అష్టోత్తరశతనామపూజలు జరుగుతాయని, సాయంత్రం 3 గంటలకు సహస్రనామపూజ, కుంకుమపూజ ఉంటాయని ఈవో తెలిపారు.
దసరా రోజు వాహనాలకు ప్రత్యేక పూజలు
అమ్మవారు గుడి ప్రాంగణంలో కొత్తగా కొనుగోలు చేసిన రకరకాల వాహనాలతో పాటు ఇంత వరకు కలిగి ఉన్న వాహనాలకు దసరా రోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అలగే అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారు.