నేర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓటమి
సాక్షి, ముంబై: యవత్మాల్ జిల్లా నేర్ మున్సిపాలిటీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇక్కడ గెలుపు కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మాణిక్రావ్ ఠాక్రే అన్ని ప్రయత్నాలూ చేశారు. అయినా చివరకు పరాజయాన్నే చవిచూడాల్సి వచ్చింది. మొత్తం 18 స్థానాల్లో శివసేన తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీలు కూట మిగా ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే బరిలో దిగినా ఇరుపార్టీలకు చుక్కెదురయింది. మొత్తం 18 స్థానాలకు ఏకంగా 111 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఇందులో శివసేన తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోగా, ఎన్సీపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మిగతా రెండిం టిలో ఒకచోటసేన మద్దతుదారుడు విజయఢంకా మోగించగా మరోస్థానంలో ఇండిపెండెంట్ గెలిచా డు. ప్రముఖ పార్టీలు సహా ఆర్పీఐ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్ కూడా బరిలో దిగినా ఆశించిన ఫలితాలు రాలేదు.సేన, కాంగ్రెస్లో తిరుగుబాటుదారుల బెడద అధికంగా ఉంది. తిరుగుబాటుదారులు శివసైనపై అంతగా ప్రభావం చూపకున్నప్పటికీ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ ఎన్నికల్లో శివసేన తరఫున ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే సంజయ్ దేశ్ముఖ్ ప్రచార బాధ్యతలు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. నేర్ మున్సిపాలిటీ మాణిక్రావ్ ఠాక్రే పాత శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి రావడంతో ఇక్కడ గెలుపు కాంగ్రెస్కు తప్పనిసరిగా మారింది. గెలుపు కోసం ఠాక్రే చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి నిరాశే ఎదురైన నేపథ్యంలో వచ్చే సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటనే చర్చ మొదలయింది.
లోహా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ హవా
నాందేడ్ జిల్లా లోహా మున్సిపాలిటికి ఇటీవల జరి గిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది. 16 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఎమ్మెన్నెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకుని మెజారిటీ సాధించుకుంది. ఎన్సీపీ ఒక్కస్థానమూ దక్కించుకోలేకపోయింది. అదే ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఏడు స్థానాలను దక్కించుకుంది. గత అనేక సంవత్సరాల నుంచి లోహా మున్సిపాలిటీ కాంగ్రెస్ అధీనంలోనే ఉండేది. ఇప్పుడది ఎమ్మెన్నెస్ చేతిలోకి వెళ్లింది.