లక్ష్యంతోనే భవిత
ఏటా లక్షలాది మంది యువతీ యువకులు చదువు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరుతుంటారు. కొలువు లభించగానే ఆదాయం మొదలవుతుంది. పొదుపు చేయడానికీ, పెట్టుబడులు పెట్టడానికీ అప్పటినుంచే అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడులకు సంబంధించి తొలి అడుగు వేయడమే పెద్ద సమస్య. పెట్టుబడులపై భవిష్యత్తులో వచ్చే ప్రయోజనాలపై తగిన అవగాహన లోపించడమే ఇందుకు కారణం. వారిని చైతన్యవంతుల్ని చేస్తే ఈ సమస్యను సునాయాసంగా అధిగమించగలుగుతారు.
ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన మౌలిక సూత్రాల గురించి వివరించడానికి నిపుణులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లోనూ ఈ పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా శిక్షణ పొందిన వారిలో 40% మంది స్ఫూర్తిపొంది మూడు నెలల్లోనే పెట్టుబడులను ప్రారంభిస్తున్నారు. పెట్టుబడుల ప్రయాణం ముందుకుసాగే కొద్దీ అనుభవం వస్తుంటుంది. అంతా అనుభవపూర్వకంగా తెలుసుకుందామనుకోవడం సరికాదు. ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి. పెట్టుబడులను ప్రారంభించే తొలినాళ్లలో సాధారణంగా జరిగే పొరబాట్లు ఇవీ...
పెట్టుబడుల సాధారణ లక్ష్యాలు అభివృద్ధి, భద్రత, ఆదాయం. అంటే, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడమే పెట్టుబడుల ముఖ్యోద్దేశం. ఆర్థిక లక్ష్యాల విషయంలో స్పష్టత ఉంటే సరైన పెట్టుబడి సాధనాల ఎంపిక సులువవుతుంది.
ఆర్థిక లక్ష్యాలను, పెట్టుబడి ప్రణాళికను ఖరారు చేసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. పెట్టుబడి ప్రణాళికల్లో క్రమశిక్షణ అత్యవసరం. క్రమశి క్షణ తప్పితే పెట్టుబడి ప్రణాళిక గాడి తప్పుతుంది.
పూర్తిగా అవగాహన ఉన్న ప్రొడక్టుల్లోనే సొమ్ము పెట్టుబడి పెట్టాలి. మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న ప్రొడక్టుల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకోవాలి. రిస్కు ఎక్కువగా ఉండే ప్రొడక్టులపై ఆదాయ అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అసాధారణ లాభాలను ఆఫరుచేసే ప్రొడక్టుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
గణనీయ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్లు ప్రారంభించాలనుకోవడం పొరబాటు. పెట్టుబడులపరంగా చూస్తే ఎంత మొత్తమైనా పెద్ద మొత్తమూ కాదు, చిన్న మొత్తమూ కాదు. ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేయాలన్న విషయం ముఖ్యం కాదు. తొలి అడుగు పడడమే అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం.
ఒక విషయం మర్చిపోవద్దు.. పెట్టుబడులకు అత్యంత ఉన్నతమైన రోజు నిన్న. రెండో అత్యుత్తమ దినం నేడు.