ఛత్ భక్తుల కోసం ప్రత్యేక రైలు
న్యూఢిల్లీ: జరిగే ఛత్ పూజకు వెళ్లేవారి సౌకర్యార్థం పాట్నాకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఉత్తర రైల్వే నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడిన ఉత్తర భారతదేశ ప్రజలు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీవరకు ఛత్ పూజ నిమిత్తం సొంత గ్రామాలకు తరలుతున్నారు. వేలాదిగా ఉన్న వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నుంచి ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి పాట్నా వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి నీరజ్ శర్మ తెలిపారు. పండగల సీజన్ నిమిత్తం సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 10వ తేదీవరకు ఉత్తర రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటివరకు నవరాత్రి, ఈద్, దసరా, దీపావళి పండుగలు ముగియగా, ప్రస్తుతం ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయని, ఈ పండగ సీజన్ మొత్తం సుమారు 3 వేల అదనపు ట్రిప్పులు నడిపామని ఆయన వివరించారు. అలాగే దీనికోసం 130 అదనపు కోచ్‌లను ఆయా రైళ్లకు కలిపామని చెప్పారు. సాధారణంగా పండగల సీజన్లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 30 నుంచి 40 శాతం అదనంగా పెరుగుతుందని శర్మ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 30 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు. ఛత్‌పూజను బీహార్ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు.