క్రీడాకారులకు ఉపాధి కల్పించాలి: నీల్ గోటే
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేఎంఐటీ డెరైక్టర్ నీల్ గోటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజి వార్షిక స్పోర్ట్స్ డే శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అంకితభావంతో తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించాలన్నారు.
స్పోర్ట్స్ చాంపియన్ అర్జున కుమార్ పటేల్‌కు ట్రోఫీని అందజేశారు. కేశవ మెమోరియల్ విద్యా సంస్థ కార్యదర్శి టి.హరిహరశర్మ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తితోపాటు క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో కాలేజి ప్రిన్సిపల్ టి.ఎం.శేఖర్‌రావు, ఫిజికల్ డెరైక్టర్ బి.లక్ష్మయ్య, మధుర హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులను సన్మానించారు.