nenunnanu movie
-
‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్’
‘క్రికెట్లో భారతే గెలుస్తుంది.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము.. కానీ ‘నేనున్నాను’ సినిమా మాత్రం సూపర్‌డూపర్ హిట్ సాధిస్తుంది’అంటూ మార్చి 11, 2004న జరిగిన ‘నేనున్నాను’ ఆడియో ఫంక్షన్లో అప్పటి యువసామ్రాట్ ఇప్పటి టాలీవుడ్ కింగ్ నాగార్జున పలికిన మాటలివి. నాగార్జున సరసన శ్రియా, ఆర్తీ అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్లో మరుపురాని మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అన్నివర్గాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ చిత్రం అనేక సెంటర్లలో వందరోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కామాక్షి మూవీస్‌పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.. సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియోతో సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వినోదం, పాటలు, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని కలబోసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బ్రహ్మానందం, అలీ, శివారెడ్డిల కామెడీ.. నాగార్జున టైమింగ్.. శ్రియ, ఆర్తిల అభినయం.. నాగార్జున, శ్రియల కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ వావ్ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా శ్రియ కోసం ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసే సీన్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి ‘నేనున్నాను’ చూసి కుటుంబసమేతంగా ఎంజాయ్ చేయండి. -
మౌనమే మంత్రమౌతున్న వేళ... ఓ వేణుమాధవా!!
పాట నాతో మాట్లాడుతుంది... తన పెన్నులో సిరా వెన్నెల - నా తండ్రి సిరివెన్నెల. మాట తీరు వెన్నెల - మనసు తీరు వెన్నెల. మనిషి తీరు సిరివెన్నెల సీతారామరాత్రి సారీ... సీతారామశాస్త్రి. ఎంత బాగా చెప్పావు... పాటా! నీ మాటల ముత్యాల పోహళింపులో శాస్త్రిగారి కూతురువనిపించావు... ఇంతకూ నీవు... ‘‘నేను... నేను... ‘నేనున్నాను’ చిత్రంలో గాలి గాంధర్వపు గీతాన్ని... గుర్తించలేదా కవీ..’’ ఓ... నాకిష్టమైన పాటవి. ఎన్నో ప్రదేశాల్లో ఇప్పుడు వస్తున్న పాటల్లో ఆనాటి ఆపాత మాధుర్యమూ లేదు. అత్యంత సాహితీ సౌగంధమూ లేదన్న ఎందరు సాహితీ ప్రియులకో ‘నీ పేరు చెప్పి ఒప్పించేవాణ్ని. నేటి సినీసాహితీ స్రష్టంలో వాసి వసి వాడలేదని నిరూపించేవాణ్ని. సరే... ఇక చెప్పు. ‘నేనున్నాను’ సినిమా - కీరవాణి సంగీతం, పాడింది చిత్ర. సన్నివేశం - తన బతుకును చిగురింపజేస్తున్న కథానాయకుడు నాగార్జునకు ఆత్మనివేదన చేసుకునే సందర్భంలో పాట రాయాలి. ‘కథానాయికని వెదురుగా పోల్చుతూ - హీరో వేణుధరుడైన మాధవునితో ఉపమిసూత శూన్యంగా ఉన్న వెదురుగొట్టంలో మోహనుడి ఊపిరి ఎలా గాంధర్వమైందో... రాయరాదా తండ్రీ’ అన్నాను... అంది. వెన్నెల సిరాక్షరాలుగా మారుతూ... ‘వేణుమాధవా!’ అని పలికింది ‘సాకీ’గా. క్రియారూపంలో పల్లవిని పల్లవింపజేయడం సిరివెన్నెల పెన్నుకవ్వంలో భావాల మీగడ పెరుగును చిలికిన వెన్న తీయడమంత సులువు. వాతావరణంలో ఉన్న వాయువు గోపాలుని ఊపిరిగా మారి, పెదవులతో వేణువునూదగానే ఉల్లము ఝల్లుమనిపించే గాంధర్వంగా మోగడాన్ని తలచుకో- అన్నాను. అంతే! నా తండ్రి సిరివెన్నెల అందుకున్నాడు. సుకుమార సుందరంగా రసబంధురంగా- ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నది- ఆపైన ఆలస్యం లేకుండా రెండో వాక్యం... ‘ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో’ అంటూ దూసుకొచ్చింది. ఆ శ్వాసలో నేను కూడా విలీనమై ఆ పెదవులపై నేను కూడా మంత్రమై నీలోకి చేరని మాధవా’ అని పల్లవి పూర్తించాడు. నా తండ్రి సీతా గీతా రామశాస్త్రి ఇంక తొలి చరణం - మురళిని అనిర్వచనీయంగా - కవితా నిర్వచనీయంగా చరణీకరించడం - ఏ రుషులకు - తాపసులకు - మధుర భక్తులకు అందని మాధవుని పెదవులపై పవ్వళించే యోగం - రసాత్మక భోగం వెదురు మురళిదంటు అందుకోసం - ఎన్ని గాయాలు తొలచుకుంటేనో ఈ అద్వైత యాగ ఫలసిద్ది అంటూ మునులకు తెలియని జపములు జరిపినదా వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున - నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది (ఓం నమో నారాయణాయ) అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధీ - వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ - ముగించాడు. ఆ పైన రెండో చరణంలో ఏం చెప్పాలి? మురళి శరీరపరంగా తొలి చరణ సరళి ముగిసింది. ఇక ఆ ముదిత శరీరపరంగా చెప్పు తండ్రీ! అన్నాను. నిదుర రాని నడిరాతిరి సిరివెన్నెల కనుపాపల కదలికలో నేను తప్ప ప్రపంచమంతా గాఢనిద్రలో కదా అనే భావం తొణికిసలాడి మరో రూపంలో కాగితంపై ప్రసరించింది. వెన్నెల రేఖలా వెలుగుల వాకలా ‘చల్లని నీ చిరునవ్వులు కనపడక - కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా - అల్లన నీ అడుగుల సడి వినపడక - హృదయానికీ అలజడితో అణువణువూ తడబడదా- ఈ పాదం నడిపేది నువ్వె - నా నాదం పలికించేది నువ్వె - సినిమాలో నాయికకు పుట్టుకతో వచ్చిన గాన కళను ప్రోత్సహించినవాడు నాయకుడు. కనుక - చివరి నాలుగు వాక్యాలను నువ్వే నడుపు పాదమిది - నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది - నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధీ... అని సంపూర్ణించాడు సిరివెన్నెల. ఇందులో కథానాయకుని పేరు వేణు అని కవికి తెలుసు. పాట రాసినట్టుగా మాట్లాడటం - మాట్లాడినట్టు పాట రాయడం మీ కవులకు, సినీకవులకు సినారె నుండి సిరివెన్నెల దాక చెల్లిందే. కానీ క్రియాపదాలతో పల్లవించడం - అందమైన అర్థాలను ఊరిస్తూ - అందమైన చెవికీ - మనసుకు - సంగీతానికి ఉచ్చరించటానికి ప్రియంగా ఒదిగే పదాలను అల్లుకుంటూ కాగితంపై చూస్తే అలవోకగా మాటాడుకునే సాదా సీదా మాటలతో ‘పాట బొమ్మ అమ్మాయిల్ని వెన్నెల్లో ఆడించడం’ నా తండ్రి సిరివెన్నెలకు విరించి పెన్నుతో పెట్టిన విద్య. అంటూ... నా విధాత - క‘విధాత’ నా పిత సీతారామశాస్త్రి పాటలూరే రాతిరి రత్న పేటికలోనే నా బస - అంటూ తన శ్వాసలో చేరితే నేను గాంధర్వమయ్యానులే అని పాడుకుంటూ వెళ్లింది. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత