'మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా'
చందంపేట (నల్లగొండ) : వచ్చే వేసవినాటికి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేసి మంచి నీళ్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తన సొంతూరు నేరడుగొమ్ములో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
మిషన్ భగీరథను పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీటి కుళాయిని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతంలో కృష్ణా పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే పుష్కరఘాట్లు ఏర్పాటు చేసి మౌలికవసతులు కల్పిస్తోందన్నారు.