'చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే సెక్షన్ 84 కింద కేంద్ర జలవనరులు సంఘం అనుమతి ఉండాలని, కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు అయినా ఉండాలని తెలిపారు.
తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సరికాదన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుతో రూ.2 లక్షలు కూడా రాష్ట్రానికి రావని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా రెడ్డి లేఖ రాశారు.