net centers
-
‘ఉపకారం’ కోసం పాట్లు
విశాఖపట్నం : ఉపకార వేతనాలు, ఫీజుల వాపస్ గడువు సోమవారంతో ముగుస్తుందని తెలిసి బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. దీంతో ఆ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఈ-పాస్ వెబ్సైట్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సోమవారం ఎంవీపీ కాలనీలోని సంక్షేమ కార్యాలయాలకు వచ్చిన బీసీ, ఎస్సీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యాసంవత్సరం (2014-15)లో 40 వేల మంది బీసీ విద్యార్థులకు ఇప్పటికి 9వేల మందే దరఖాస్తు చేశారు. వీరికి ఫీజుల కోసం రూ.85 కోట్లు, ఈబీసీలకు ఫీజుల కోసం రూ.30 కోట్ల బడ్జెట్ అవసరముంటుంది. ఇక బీసీలకు ఉపకార వేతనాల కోసం రూ.20 కోట్ల బడ్జెట్ అవసరం. ఇక ఎస్సీ విద్యార్థులు 6380 మందికి 2902 మందే దరఖాస్తు చేయగలిగారు. వీరికి ఫీజులు, ఉపకారవేతనాల కోసం రూ.10 కోట్ల బడ్జెట్ అవసరముంటుంది. జిల్లాలోని 535 కళాశాలలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది రెన్యువల్, ఫ్రెష్ విద్యార్థులనుంచి ఒకేసారి దరఖాస్తులు స్వీకరించడంతో ఈ-పాస్ వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగిపోయి, తరచూ లింక్‌ఫెయిలవుతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కిటకిటలాడుతున్న నెట్‌సెంటర్లు వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా మీ-సేవ, ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. రోజూ అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. పలువురు విద్యార్థులు ధ్రువపత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రం విడిపోయిన దృష్ట్యా జూన్ తర్వాత తీసుకున్న ధ్రువపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. కళాశాలల నిర్లక్ష్యం విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాల మంజూరు విషయంలో కళాశాలల నిర్లక్ష్యం వల్లే ఆలస్యమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని 75 కళాశాలలు ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫారాలు పొందుపరచలేదు. దీంతో ఆ యా కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు కన్ఫర్మ్ కావడం లేదని సంక్షేమశాఖల అధికారు లు అంటున్నారు. రెండేళ్లుగా దరఖాస్తుల పరి శీలన అధికారులుగా కళాశాలల ప్రిన్సిపాళ్లే వ్య వహరిస్తున్నారు. కానీ ఏ సమస్య వచ్చినా సరే ఎంవీపీ కాలనీలోని సంక్షేమశాఖల కార్యాలయాలకు వెళ్లిపోండని చెప్పడంతో విద్యార్థులు పాఠాలు మానేసి మరీ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాదికి చెందిన 1200 ఎస్సీ దరఖాస్తులు ఇప్పటికీ కళాశాలల్లోనే మూలుగుతున్నాయి. ఈ దరఖాస్తులను ఈ నెల 14 లోగా జిల్లాకేంద్రానికి పంపుకోవాలని సాంఘికసంక్షేమశాఖ డీడీ ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు గడువు పెంపు గడువులోగా విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోలేకపోవడంతో ప్రభుత్వం రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు పొడిగించిందని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ డి.వి.రమణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్ విభాగం విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ ఏడాది జూన్ తర్వాత తీసుకున్న ధ్రువపత్రాలు అప్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. -
నెట్ సెంటర్లపై అధికారుల దాడి
రాజాం, న్యూస్‌లైన్: అనుమతి లేకుండా సినిమా పాటలు, వీడియో క్లిప్పింగులు డౌన్లోడ్ చేస్తున్న నెట్ సెంటర్లపై ఐఎంఏ సిబ్బంది దాడి చేసి నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా పాటలు డౌన్లోడ్ చేస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఇండియన్ మ్యూజికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరుపున వీవీ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది పట్టణంలో ఎనిమిది షాపులపై మంగళవారం దాడులు చేశారు. రాజరాజేశ్వరి సెల్ సర్వీస్, వాగ్దేవి నెట్ కనెక్షన్, ఎస్ఆర్బీ సెల్పాయింట్, రాజ్ సెల్పాయింట్, జేఎస్ఆర్ కమ్యూనికేషన్స్, ఎస్ఎస్ఆర్ ఎంటర్‌ప్రైజస్, టీవీఆర్ మొబీకేర్, కృష్ణ సెల్పాయింట్ తదితర షాపులపై దాడులు చేసి పెన్ డ్రైవ్‌లు, చిప్డ్రైవ్లు, సీడీలు, సీజ్‌చేసి పోలీసులకు అప్పగించారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రభాకరరావు తెలిపారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.