కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం
మరికొందరిని ఎవరెస్ట్ ఎక్కిస్తాం
ఎత్తయిన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పూర్ణ, ఆనంద్
‘నెవర్ గివప్’.. ఇచ్చిన స్ఫూర్తే విజయానికి తోడ్పడింది
ఐపీఎస్లమవుతాం..మరికొందరికి తోడ్పాటు ఇస్తామని వ్యాఖ్య
తెలుగుతేజాలకు తృటిలో తప్పిన ప్రమాదం
తిరుగు పయనమైన గురుకుల విద్యార్థులు
ఐదు రోజుల తర్వాతే భారత భూభాగంలోకి ప్రవేశం
హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంత కష్టమైనా.. ఇష్టపడి చేసి విజయం సాధించామని గురుకుల విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్ చెప్పారు. తాము ఐపీఎస్ అధికారులం అయి మరికొందరు విద్యార్థులకు తామే శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తామని పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని సాధించామని.. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లామని చెప్పారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన అనంతరం తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, వారి శిక్షకుడు శేఖర్‌బాబు.. బుధవారం బేస్‌క్యాంపు నుంచి బయలుదేరిన అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తొలుత మాలావత్ పూర్ణ మాట్లాడుతూ... ‘‘ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టంగా అనిపించినా.. ఇష్టంగా చేశా. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లాలనిపించింది. పైకి వెళ్లేటపుడు క్యాంప్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యా. అయినా మా కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, దాని కోసం ఎంతో కష్టపడిన ప్రవీణ్‌కుమార్ సార్ గుర్తుకువచ్చారు. కలలో కూడా ఊహించని అవకాశమిచ్చిన ఆయన లక్ష్యం కోసం ఏదైనా చేయాలని అనిపించి ముందుకే వెళ్లా. 8,500 మీటర్ల ఎత్తు దాటిన తరువాత కొన్ని శవాలు కనిపించాయి.
అక్కడ కాస్త భయం అనిపించినా.. లక్ష్యం అధిగమించింది’’ అని పేర్కొన్నారు. ‘‘స్వేరోస్‌లో చదివే వారికి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద టెన్ కమాండ్మెంట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థీ ఉదయం కచ్చితంగా వీటిని చదువుతారు. అందులో ఆఖరుది ‘నెవర్ గివప్’. ఇది ఇచ్చిన స్ఫూర్తే కష్టమైనా వెనుతిరగక లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. అలసటగా అనిపించినప్పుడల్లా గ్లూకోజ్ తాగడం, చాకోలెట్ తినడం వంటివి చేస్తూ ముందుకెళ్లాం. ‘8,848’ పాయింట్ దగ్గర నిలుచున్నప్పుడు మా ప్రవీణ్ సారే కళ్లముందు కదలాడారు. ఆయన నమ్మకం నెరవేర్చినందుకు ఆనందంగా అనిపించింది’’ అని ఆనంద్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శేఖర్‌బాబు మాట్లాడుతూ... ప్రతి కూల పరిస్థితుల్లోనూ పూర్ణ, ఆనంద్ చూపిన చొరవ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ‘‘ప్రతీ సూచనను, సలహాలను పక్కాగా ఆచరిస్తూ ముందుకు సాగారు. పొడి మంచు, మంచు చరియలు కూలడం వంటి ఘటనలు ఎదురైనా, కొన్ని గంటలపాటు సంప్రదింపులు సాధ్యం కాకపోయినా వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బేస్ క్యాంప్‌కు చేరుకున్నాక మీ లక్ష్యాలు ఏమిటని అడిగితే.. ‘ఐపీఎస్ అధికారులం అవుతాం, మరికొందరు స్వేరోస్ విద్యార్థులకు స్వయంగా శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తాం..’ అన్నారు..’’ అని ఆయన పేర్కొన్నారు.
తప్పిన ప్రమాదం..: భూమిమీదే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే కాదు.. తిరిగి కిందికి దిగడమూ అత్యంత ప్రమాదకరమే. అప్రమత్తంగా వ్యవహరించడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పూర్ణ, ఆనంద్ 52 రోజుల సాహసయాత్రతో ఆదివారం ఉదయం 6-7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అనంతరం అలసటను లెక్కచేయకుండా తిరుగు ప్రయాణం ప్రారంభించి, బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అయితే వీరి తర్వాత ఎవరెస్ట్ శిఖరంపైకి ఆలస్యంగా చేరుకున్న ఒక పర్వతారోహకుడు ఆలస్యంగా దిగడం మొదలుపెట్టారు. కానీ, చీకటి, పొడి మంచు కారణంగా మంగళవారం రాత్రి ఎల్లో బ్యాండ్ క్యాంప్‌లో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా ముంచుకు వచ్చిన మంచు చరియలు.. ఈ క్యాంప్‌తో పాటు దిగువన ఉన్న మరో మూడు క్యాంపులనూ తుడిచిపెట్టేయడంతో ఆయన మరణించారు. కాగా తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, శేఖర్‌బాబు ప్రస్తుతం చైనా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్నారు. వారు భారత భూభాగంలోకి అడుగుపెట్టడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశముంది.