సాధ్వి ఇంట్లో 24 బంగారు కడ్డీలు.. కోటికి పైగా కొత్తనోట్లు
ఆమె ఒక సాధ్వి. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ, పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పుడు ఏకంగా 80 లక్షల రూపాయల విలువైన 24 బంగారు కడ్డీలు, కోటి రూపాయల రెండువేల నోట్లు దొరికాయి! ఆ బంగారాన్ని కూడా ఆమె నవంబర్ నెలలోనే కొన్నారు. సాధ్వి జై శ్రీగిరి అనే ఈ మహిళ గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఒక ట్రస్టు నిర్వహిస్తారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఒక ఆలయం కూడా ఉంది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన వద్ద బంగారం కొన్నందుకు చెల్లించాల్సిన ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోవడం లేదని ఒక నగల వ్యాపారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెళ్లారు.
ఆమె ఇంట్లో 80 లక్షల విలువైన 24 బంగారు కడ్డీలు, కొత్త రెండువేల రూపాయల నోట్లలో 1.2 కోట్ల నగదు పట్టుబడ్డాయి. ఇంకా విశేషం ఏమిటంటే, మద్యనిషేధం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఉండి.. ఆమె ఆశ్రమంలో మద్యం బాటిళ్లు కూడా దొరికాయి. ఇప్పటివరకు ముగ్గురిపై కేసు పెట్టామని, ప్రధాన నిందితురాలు సాధ్విని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డిసెంబర్ నెలలో ఆమె ఒక కార్యక్రమంలో గాయనీ గాయకులు పాడుతున్నప్పుడు దాదాపు కోటి రూపాయల విలువైన రెండువేల రూపాయల నోట్లు వాళ్లపై విసురుతుండగా సాధ్వి జై శ్రీగిరిని ఎవరో వీడియో తీశారు. అప్పటికి కొత్త నోట్లు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయం కావడంతో ఈ ఘటన బాగా వివాదాస్పదంగా మారింది.