ట్రిపుల్ ఐటీకి కొత్త కళ
రూ.39కోట్లతో అభివృద్ధి పనులు
నూజివీడు : నూజివీడు ట్రిపుల్ ఐటీ కొత్తకళ సంతరించుకుంటోంది. క్యాంపస్‌లోని రోడ్లన్నింటినీ సిమెంట్ రహదారులుగా అభివృద్ధి చేయడంతోపాటు పలు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 2నెలలుగా ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ఆరేళ్లుగా కంకరరోడ్లకే పరిమితమైన రోడ్లు ఎట్టకేలకు సిమెంట్‌రోడ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి.
రెండేళ్ల క్రితమే రోడ్ల అభివృద్ధితో పాటు క్యాంటీన్ భవనం, వాషింగ్‌మెషీన్ల ఏర్పాటుకు భవనం, అధునాతన గ్రంథాలయ భవనం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ల నిర్మాణానికి ఆర్జీయూకేటీ రూ.39కోట్లు కేటాయించింది. అయితే ఈ పనులను చేపట్టడంలో జాప్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై నెలలో ఈ పనులను ప్రారంభించారు. దీనిలో భాగంగా ట్రిపుల్ఐటీ ఆవరణలో ఉన్న 3కిలోమీటర్ల కంకర రహదారులన్నింటినీ సిమెంట్‌రోడ్లుగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే దాదాపు 50శాతం వరకు పనులు పూర్తయ్యాయి. అలాగే క్యాంటీన్ నిర్మాణం పనులు ప్రారంభమై పిల్లర్ల దశకు చేరుకున్నాయి. ఇంకా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు, వాషింగ్‌మెషీన్ల ఏర్పాటుకు అవసరమైన భవనం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అలాగే విద్యార్థులు వ్యాయామం, యోగా, చదరంగం వంటి ఆటలతో పాటు డ్యాన్స్ సాధన చేసేందుకు గానూ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ భవనం పనులను ప్రారంభించాల్సి ఉంది. ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే నూజివీడు ట్రిపుల్ఐటీకి నూతన శోభ చేకూరనుంది.