కొత్త ‘ఇమ్మిగ్రేషన్’ పై ఎల్లుండే ట్రంప్ సంతకం!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై బుధవారం సంతకం చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని చట్టప్రతినిధులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించిన మరుసటి రోజు ఆయన సంతకం చేయనున్నట్లు శ్వేతసౌదం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఆదేశాలపై ట్రంప్ గతవారంలోనే సంతకం చేయాలని అనుకున్నారంట. అయితే, ఎలాంటి లోపాలు కొత్త ఆర్డర్లలో లేకుండా జాగ్రత్తగా చూసుకునేందుకే ఆయన ఈ వారం వరకు కావాలని నిలిపి ఉంచినట్లు అమెరికా అంతర్గత భద్రత వ్యవహారాల అధికారిక ప్రతినిధి సియాన్ స్పైసర్ తెలిపారు.
ఏడు ముస్లిం దేశాలవారు అమెరికాలో అడుగుపెట్టవద్దంటూ డోనాల్డ్ ట్రంప్ అప్పటికప్పుడు కొత్త ఎగ్జిక్యూటివ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఫెడరల్ కోర్టు జడ్జీ ట్రంప్ నిర్ణయం చెల్లబోదని అడ్డుకున్నారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి కాస్తంత ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఈసారి మాత్రం గతంలో జారీ చేసిన కొత్త ఇమ్మిగ్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకొని సంతకాలు చేయనున్నారట. అయితే, అందులో ఎలాంటి అంశాలు పొందుపరిచారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.