'వారి కలే ఇంకా తీరలేదు.. ఇక తెలుగు వారిది'
రాంచీ: జార్ఖండ్ రాజధాని ఏది అనగానే టక్కున రాంచీ అని చెప్పేస్తాం. కానీ మిగితా రాజధాని ప్రాంతాలను తలపించేలాగా రాంచీ మాత్రం ఉండదంటే నమ్మలేరేమో. 2000 సంవత్సరంలో బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ విడిపోయింది. ఇలా విడిపోయి దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు మాత్రం నత్తనడకనే ఉన్నాయి. రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(హెచ్ఈసీ) పరిధిలోని రెండు వేల ఎకరాల్లో ఈ రాజధాని నిర్మించే పనులు మొదలు పెట్టారు. నాటి డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీ, కొత్త రాజధాని నిర్మాణం కోసం 2002లో శంఖుస్థాపన చేశారు.
కానీ ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పలు ప్రభుత్వ కార్యాలయాలన్ని కూడా ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఈ రాజధాని చుట్టూ ఓ రింగ్ రోడ్డు వేసేందుకు పనులు ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్త రాజధాని ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల ఆందోళన. దాదాపు 50 సంవత్సరాలుగా ఉంటున్న వారంతా అనూహ్యంగా ఆ ప్రాంతాన్ని వెళ్లేందుకు నిరాకరించడం మొదటి కారణమైతే, ఖాళీ చేసి వెళ్లాల్సిన ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మరో కారణం. దీంతోపాటు రాజధాని ప్రాంతం కావడంతో అరకొర వసతులే ఉన్న రాంఛీకి అనూహ్యంగా జన ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం ఆ రాజధాని ప్రాంతం విద్యుత్, నీరు, వసతి, రోడ్లతోపాటు సౌకర్యాల లేమిని ఎదుర్కోంటుంది.
పదిహేనేళ్ల కిందట ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ రాజధాని నిర్మాణానికే ఇన్ని రకాల సమస్యలు తలెత్తి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ అసంపూర్ణంగా ఉండిపోతే.. నిన్నకాక మొన్న ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఎన్ని సమస్యలు ఎదుర్కోనుందో కాలమే జవాబుదారి కానుంది. ఓ రాజధాని పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందో పక్కనే ఉన్న రాష్ట్రం ద్వారా తెలుస్తున్నప్పుడు తన పదవికాలంలోనే రాజధాని పూర్తి చేస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఎంతమేరకు నిజమో ఎదురుచూడాల్సిందే.