జిల్లా మొత్తం సస్యశ్యామలమే
కరువు అనేదే ఉండదు
ఉమ్మడి రాష్ట్రంలో మెతుకుసీమ వెనుకబాటు
ఆకలి చావులు ఇక్కడే అధికం
రైతుల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్
- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
తూప్రాన్: మల్లన్న సాగర్‌తో జిల్లా మంచి రోజులు రానున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు అనేది ఉండదని, జిల్లా అంతా సస్యశ్యామలమవుతుందన్నారు ఆదివారం తూప్రాన్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మెదక్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాను మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రాజకీయ కుట్రలు పన్నినా మల్లన్న సాగర్‌ను కట్టితీరుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా ప్రజల మనుగడ ముడిపడి ఉందన్నారు. ఇది పూర్తయితేనే సీఎం కేసీఆర్ కల సాకారమవుతుందన్నారు. ప్రజలు సైతం తమ భూములను ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎనిమిది ముంపు గ్రామాలకు గాను ఏడు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చినట్టు తెలిపారు.
సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆగస్టు 7న ప్రారంభించేందుకు గజ్వేల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామునిగారి శ్రీశైలంగౌడ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, సర్పంచ్ శివ్మమ్మ, ఉప సర్పంచ్ నందాల శ్రీనివాస్, నాయకులు మన్నె శ్రీనివాస్, మామిడి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.