New pill
-
రక్తపోటుకు చెక్ పెట్టే సూపర్ పిల్
లండన్ : రక్తపోటును సాధారణ స్ధాయికి తీసుకువచ్చే అద్భుత పిల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటును నియంత్రించే మూడు మందుల కాంబినేషన్‌తో రూపొందే ఈ ట్యాబ్లెట్ బీపీ రోగులకు వరంగా మారుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీపీ మందులతో కేవలం 50 శాతం ప్రజలకే బీపీ నియంత్రణలో ఉంటోంది. అయితే నూతన కాంబినేషన్ పిల్‌తో ఆరు నెలల్లో 70 శాతం మందికి బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తపోటుకు వాడే టెల్మిసర్టాన్, అమ్లోడిపైన్, క్లోరోతాలిడోన్ కాంబినేషన్‌తో రూపొందిన ఈ పిల్‌ను రోగులకు ఇవ్వగా 70 శాతం మంది రోగుల్లో బీపీ సాధారణ స్ధాయికి వచ్చిందని వెల్లడైంది. తమ అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రక్తపోటు నియంత్రణలో ఉంచడంతో పాటు, వారికి గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును తగ్గిస్తాయని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రూత్ వెబ్‌స్టర్ వెల్లడించారు. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఈ అథ్యయనాన్ని చేపట్టింది. -
ఈ 'పిల్'తో ఆ ఆలోచన రానేరాదట!
నిరాశ, నిస్పృహలో కుంగిపోయిన చాలామందిని 'ఆత్మహత్య' ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. సమస్యలు, నిస్సహాత, మానసిక బలహీనతలే చాలామందిని బలవన్మరణాలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏడురోజుల్లోనే ఆత్మహత్యకు పురికొల్పే ఆలోచనలకు పుల్ స్టాఫ్ పెట్టే సరికొత్త ఔషధ మాత్రను తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వారంలోపే ఈ మాత్ర ప్రభావం చూపి మనుష్యులను బలన్మరణం ముప్పు నుంచి తప్పిస్తుందని వారు తెలిపారు. మెదడులో ఉత్పత్తి అయ్యే 'ఫీల్ గుడ్ రసాయనం' 'ఒపియాయిడ్'తో రూపొందిన ఈ ఔషధం వల్ల ఏడురోజుల్లోనే మనుష్యుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు గణనీయంగా ఆగిపోయాయని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఈ పరీక్షల్లో భాగంగా తమ జీవితాన్ని చాలించాలనుకుంటూ ప్రమాదకర స్థితిలో 40 మంది వ్యక్తులకు 'ఒపియాయిడ్'ను తక్కువ మోతాదులో ఏడురోజులపాటు ఇచ్చారు. దీంతో వారిలో ఈ ఆలోచనలు 50శాతం తగ్గి.. సానుకూల దృక్పథం మెరుగుపడింది. ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. 'ఒపియాయిడ్'ను సాధారణంగా నొప్పి తగ్గించేందుకు 'పెయిన్ కిల్లర్'గా వైద్యులు ఉపయోగిస్తారు. బుప్రీనార్ఫైన్గా పిలిచే దీనిని వేసుకోవడం వల్ల కేవలం వారంరోజుల్లోనే ఆత్మహత్య ఆలోచనలు తిరుగుముఖం పట్టాయని న్యూసైంటిస్ట్ పత్రిక తెలిపింది. మరిన్ని పరీక్షల్లో కూడా ఈ మాత్ర విజయవంతమైతే త్వరలోనే ఆత్మహత్యలను నిరోధించేందుకు వేగంగా పనిచేసే ఔషధం మార్కెట్లోకి వచ్చినట్టేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనలతో సతమతమవుతున్న వ్యక్తులపై ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలైన కౌన్సెలింగ్, కుంగుబాటు నిరోధక చికిత్సల ప్రభావం దాదాపు ఆరునెలలకుకానీ ఉండటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఔషధ మాత్ర మార్కెట్లోకి వస్తే గణనీయమైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.