జెన్కోకు 24 వేల కోట్లు
కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఆర్ఈసీ రుణం
సీఎం సమక్షంలో ఎంవోయూపై సంతకాలు
నిధుల సమీకరణ లక్ష్యం నెరవేరింది: సీఎం కేసీఆర్
హైదరాబాద్: కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంకోసం తెలంగాణ జెన్కోకు రూ.24 వేల కోట్ల రుణం ఇవ్వడానికి కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. శనివారం ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో సీఎం క్యాంప్ ఆఫీసులో ఆర్ఈసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ రాజీవ్ శర్మ, తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి. ప్రభాకర్‌రావు ఈ ఎంవోయూపై సంతకం చేశారు. 6,280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేస్తారు. 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏడో దశ, 1,080 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టనున్న మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్రాజెక్టు, నల్లగొండ జిల్లా దామరచెర్లలో నిర్మించనున్న 4,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లకు ఆర్ఈసీ ఈ నిధులను సమకూర్చుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన మేరకు ఆర్ఈసీ ఇచ్చే రుణానికి.. మిగతా రాష్ట్రాలు చెల్లిస్తున్న వడ్డీ రేటు కంటే 0.5 శాతం తగ్గించేందుకు ఆర్ఈసీ చైర్మన్ రాజీవ్‌శర్మ అంగీకరించారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తామన్నారు.
జెన్కోపై రూ.600 కోట్ల ఆర్థిక భారం తగ్గింపు..
వడ్డీ రేటు తగ్గింపుతో తెలంగాణ జెన్కోపై రూ.600 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుంది. ఆర్ఈసీ ఇచ్చే రూ.24 వేల కోట్లతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఈ ప్లాంట్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించింది. దీంతో పాటు జెన్కో రూ.3,000 కోట్లు వీటికి వెచ్చించనుంది. దీంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మొత్తంగా రూ.42 వేల కోట్ల నిధులు సమకూరినట్లయింది. ఎంవోయూపై సంతకాల అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ ప్రాజెక్టుల బృహత్తర లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధులతో పాటు మౌలిక సదుపాయాలు, టౌన్షిప్ అభివృద్ధి, విద్యుత్ ప్లాంట్లకు నీటి సరఫరా, బొగ్గు సరఫరాకు రైల్వే ట్రాక్.. ఇలాంటివెన్నో అధిగమించాల్సి ఉందన్నారు. ఆర్ఈసీ, పీఎఫ్సీ, జెన్కో నిధుల లభ్యతతో కీలకమైన పెట్టుబడి లక్ష్యం నెరవేరిందన్నారు. అవసరమైన భూముల సేకరణ రెండో ప్రధానమైన అంశమని అన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు 1,134 ఎకరాల భూములు సేకరిస్తున్నామని.. పర్యావరణ అనుమతులు త్వరలోనే వస్తాయని తెలిపారు. బీహెచ్ఈఎల్ పనులు కూడా ప్రారంభించిందని చెప్పారు. కేటీపీఎస్ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటుకు సరిపడేంత భూమి అందుబాటులో ఉందన్నారు. మిగతా 4,400 మెగావాట్ల ప్లాంట్లకు.. నల్లగొండ జిల్లాలో పది వేల ఎకరాల భూములు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్లకు 4.6 టీఎంసీల నీటిని పక్కనే ఉన్న కృష్ణా నది నుంచి తీసుకుంటామన్నారు.
ఎన్టీపీసీ నిర్మించాల్సిన 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. మిగతా 2,400 మెగావాట్ల ప్లాంట్లను ఎన్టీపీసీ దామరచర్ల ప్రాంతంలోనే నిర్మించనున్నట్లు తెలిపారు. దీంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా దామరచర్ల ప్రాంతం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ప్రాంతంగా అవతరిస్తుందని అన్నారు. నల్లగొండ జిల్లాకు ఈ వెలుగుల ఘన కీర్తి దక్కుతుందన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఆర్ఈసీ ఫైనాన్స్ డెరైక్టర్ అజిత్ అగర్వాల్, టెక్నికల్ డెరైక్టర్ పీజే థక్కర్, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్.వెంకటేశన్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.