మండోలిలో కొత్త జైలు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఖైదీల సంఖ్య పెరిగిపోతుండటంతో జాతీయ రాజధానిలో ఈ ఏడాది కొత్త జైలును ప్రారంభించనున్నారు. మరో రెండు జైళ్లు 2015 వరకు అందుబాటులోకి రానున్నాయి. తీహార్ జైలు ఇటీవల కాలంలో ఖైదీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆ జైలులో 6,250 ఖైదీలు ఉండేందుకే వసతులు ఉండగా ప్రస్తుతం సుమారు 13 వేలమంది ఖైదీలు ఉంటున్నారు.దీంతో మండోలి, నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో కొత్త జైలు భవనాలను నిర్మిస్తున్నారని తీహార్ జైలు పీఆర్వో సునీల్ గుప్తా తెలిపారు. రోహిణీలో ఉన్న జైలులో రెండు వేలమంది ఖైదీలకు సరిపడా మాత్రమే వసతులున్నాయని చెప్పారు. మండోలిలో నిర్మిస్తున్న జైలుభవనం ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశముందని గుప్తా చెప్పారు.
మిగిలిన రెండు జైళ్లు వచ్చే ఏడాదికల్లా పూర్తవుతాయని ఆయన వివరించారు. తూర్పు ఢిల్లీ మండోలిలో నిర్మిస్తున్న జైలు భవనంలో 3,776 మంది ఖైదీలకు వసతి కల్పించనున్నారు. ఇందులో ఆరు విభాగాలుంటాయని చెప్పారు. ఇందులో ఒకటి దోషులకు, ఒకటి మొదటిసారి శిక్ష పడినవారికి, చాలాకాలంగా అండర్ ట్రయిల్స్గా ఉన్నవారికి, యువకులకు, మహిళలకు వేర్వేరుగా ఒక్కో భవనాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. మరొకటి ప్రత్యేకంగా హై సెక్యూరిటీ ఖైదీల కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ జైలు 68 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. ఈ జైలులో సీసీటీవీ కెమెరాలు, అత్యంత ఆధునిక నిఘా పరికరాలను ఏర్పాటుచేస్తున్నామని గుప్తా చెప్పారు. అలాగే నరేలా, బాప్రోలా ప్రాంతాల్లో సైతం త్వరలోనే జైలు భవనాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు వివరించారు. బాప్రోలాలో 125 ఎకరాల్లో ఓపెన్ జైలును నిర్మిస్తున్నామని గుప్తా చెప్పారు.