కలెక్టరేట్లో డ్వాక్రా స్టాల్
కడప సెవెన్రోడ్స్ :
కొత్త కలెక్టరేట్ ఆవరణంలో సోమవారం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్రా స్టాల్ ప్రారంభమైంది. బహిరంగ మార్కెట్లో లభించే వివిధ రకాల సరుకుల కంటే కొంత తక్కువ ధరలతో సరుకుల విక్రయాన్ని చేపట్టారు. మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్య ద్వారా సేకరించిన కందుల నుంచి కల్తీ లేని కందిపప్పును తయారు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పది వేల కిలోల కందిపప్పు విక్రయానికి సిద్ధంగా ఉంది. ఇకపై నెలకు 30 వేల కిలోల కందిపప్పును సిద్దం చేయాలని జిల్లా సమాఖ్య నిర్ణయించింది. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ. 130 కాగా, డ్వాక్రా బజారులో రూ. 110లకు విక్రయిస్తున్నారు. అలాగే పసుపు 200 గ్రాముల ప్యాకెట్ బయట రూ. 45 కాగా, ఇక్కడ రూ. 30, రాగిమాల్ట్ 200 గ్రాములు రూ. 50కి గాను రూ. 40, అరకిలో రాగిపిండి రూ. 45కుగాను రూ. 40, కొర్రబియ్యం కిలో రూ. 55కి గాను రూ. 50, జొన్న పిండి రూ. 45కుగాను రూ. 40లతో విక్రయాలు చేపట్టారు. కలెక్టరేట్ ఉద్యోగులతోపాటు వివిధ పనుల మీద వచ్చిన పలువురిని డ్వాక్రా స్టాల్ ఆకర్శిస్తోంది.