కొత్త రవాణా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
రాజ్‌విహార్(కర్నూలు జిల్లా): రవాణా రంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం స్థానిక సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు, అనుబంధ కార్మిక, ఆటో డ్రైవర్స్, వర్కర్స్, మోటర్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో బంద్ పాటించారు.
రవాణా శాఖ ఎంవీఐల సంఘం పిలుపు మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఏఎంవీఐలు, ఇతర ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆందోళనకారులు రవాణా శాఖ కార్యాలయంలోకి వచ్చి ఉద్యోగులను బయటకు పంపేయడంతో పౌర సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో 12 శాతం (68 బస్సులు) సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో సంస్థకు సుమారు రూ.30లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. బంద్ కారణంగా జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.