అలక పాన్పులు ... సిద్ధం చేయండి !
తెలంగాణ టీడీపీకి కాలం కలసి వస్తున్నట్లు లేదు. చివరకు సంస్థాగతంగా కూడా ఆ పార్టీ నేతలకు తలబొప్పి కడుతోంది. మహానాడు ముగిసినా, ఇప్పటికీ పార్టీ పదవులకు దిక్కూమొక్కూ లేదు. వారంలోగా కొత్త అధ్యక్షుడు, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించాలని అధినేత ‘చంద్రం’ తేల్చారు. ఇంకేం, ఎవరికి వారు ఊహల ఊయలల్లో తేలిపోవడం మొదలు పెట్టారు. ఏ పదవి ఎవరికి ఖరారైపోయిందన్న సమాచారం అందుకున్న టీ టీడీపీలోని ఓ కీలక నేత అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఎలాగూ రాదని గట్టిగా నమ్ముతున్న ఆ నాయకుడు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టన్నా దక్కక పోతుందా అని ఆశపడ్డారు.
సదరు నేతపై ఇప్పటికే ‘టీఆర్ఎస్ కోవర్టు’ అన్న ముద్ర ఉందాయే. దీంతో ఆయనకు ఆ పదవీ రాదని అంతా చెవులు కొరుక్కోక ముందే.. వర్కింగ్ ప్రెసిడెంట్ మంచివాళ్లకు ఇస్తే నాకే అభ్యంతరం లేదంటూ ముందు నుంచే నసగడం మొదలుపెట్టారు. అలా అంటున్నారంటే, అధినేత వద్ద మళ్లీ ఏదో టెండరు పెడతారని, లేదంటే అలక పాన్పు ఎక్కుతారని ‘తమ్ముళ్లు’ గుసగుసలు పోతున్నారు. అలక బూని సొంత పార్టీ అధ్యక్షుడ్ని బ్లాక్మెయిల్ చేసే నేతల సంఖ్య ఎక్కువగానే ఉందని, వీరందరికీ ఓ పది అలక పాన్పులు సిద్ధం చేయాల్సిందేనని చమత్కరిస్తున్నారు...!!