మార్చిలోగా పత్రికా ప్రకటనల రేట్లు ఖరారు
- సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్
సాక్షి, హైదరాబాద్: మార్చి నెలాఖరులోగా పత్రికల్లో ప్రకటన రేట్లు ఖరారు చేయడంతో పాటు వీలైనంత త్వరలో ఎంపానల్మెంట్ను నియమించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఐసీ) సబ్ కమిటీ కన్వీనర్ గురిందర్ సింగ్, సభ్యుడు ప్రభాత్ కుమార్ దాస్ మంగళవారం నవీన్మిట్టల్తో భేటీ అయ్యారు. పత్రికలకు వాణిజ్య ప్రకటన రేట్లు ఖరారు చేసే అంశంపై చర్చించారు. పెద్ద, మధ్య, చిన్న తరహా పత్రికలకు వాణిజ్య ప్రకటనల జారీకి సంబంధించి ఎంపానెల్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా పీసీఐ సబ్ కమిటీ సూచించింది.
ఈ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై ఎంపానెల్మెంట్కు దరఖాస్తు చేసుకున్న పత్రికల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సబ్ కమిటీ సూచనలపై నవీన్ మిట్టల్ స్పందిస్తూ... 2015 డిసెంబర్ నుంచే పత్రికల రెగ్యులారిటీపై దృష్టి సారించిందని, రెగ్యులారిటీ ఆధారంగానే రేట్ల నిర్ణయం జరుగుతుందన్నారు. వివక్షకు తావులేకుండా అన్ని భాషా పత్రికలకు తమ శాఖ ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. సమావేశంలో సమాచార శాఖ డైరక్టర్ కిశోర్ బాబు, జేడీ నాగయ్య కాంబ్లే, డిప్యూటీ డైరక్టర్ జి.సుజాత, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిశోర్ బాబు పాల్గొన్నారు.