విస్తారా, ఎయిర్ ఏషియా కొత్త విదేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విమానయాన పథకం నేపధ్యంలో దేశీయ విమానయాన సంస్థలు శరవేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సర్వీసుల నిబంధనలో మార్పులు కొన్ని నూతన సంస్థలకు కాసులు పండించనున్నాయి. 5/20 నిబంధనలోని అయిదేళ్ల సర్వీసును తొలగించడంతో ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా సంస్థలు తమ విదేశీ సర్వీసులను ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. ఇవి రాబోయే సంవత్సరంలో ఇంటర్నేషనల్ సేవలను ఆశించవచ్చని ఇండియా అండ్ సౌత్ ఏషియా ఐ జెట్స్ ఎండీ రాజన్ మెహ్రా మీడియాకు వెల్లడించారు.
మొత్తంమీద సుదీర్ఘకాల నిరీక్షణ తరువాత వచ్చిన నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ పరిశ్రమ దీర్ఘకాలిక వృద్ధికి సానుకూలమని మెహ్రా అభిప్రాయపడ్డారు. అలాగే కొత్త పౌర విమానయాన విధానం భారతదేశం విమాన పరిశ్రమలో కొత్తగా ప్రవేశించిన ఎయిర్ఏషియా, విస్తారా లాంటి వాటికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందనీ, మరోవైపు ఇండిగో, జెట్ ఎయిర్వేస్ వంటి పాత ఆటగాళ్లకు ప్రతికూలంగా ఉంటుందని తెలిపారు. 2020 నాటికి 300 మిలియన్ ప్రయాణీకుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. గంటకు రూ. 2500 చార్జ్ దేశీయ విమానయానానికి ప్రోత్సహాన్నిస్తుందన్నారు. పరిశ్రమల చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టిపెట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూరిజం, దేశీయ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని మెహ్రా చెప్పారు.
చార్జీల తగ్గింపుతోపాటు నిర్వహణ, మరమ్మత్తు. ఆపరేషన్స్ (ఎంఆర్వో) లకు రాయల్టీ చెల్లింపులకై కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం మంచి పరిణామమన్నారు. అంతేకాదు ఈ ఎంఆర్వో సర్వీసులపై వ్యాట్ ను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం చెప్పిందన్నారు . ఈ చర్యలు భారతదేశాన్ని ఎంఆర్ వో హబ్ గా మార్చేందుకు దోహదం చేస్తాయన్నారు.