ఆరోగ్య పథకాలకు రూ.1,196 కోట్లు
ఎన్హెచ్ఎం కింద నిధుల కోరిన రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కార్యక్రమాలకు అవసరమైన నిధులు కోరుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) ఎన్హెచ్ఎం ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు రూ.1196.04 కోట్లు కావాలని కోరుతూ నివేదిక పంపింది. 2016–17లో తెలంగాణకు ఎన్హెచ్ఎం కింద కేంద్రం రూ.750 కోట్లు కేటాయించిన సంగతి విదితమే. ఈసారి రూ.400 కోట్లకుపైగా అధికంగా ప్రతిపాదించారు.
కేంద్రం అంత మొత్తం కేటాయిస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.750 కోట్లు కేటాయించగా అందులో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడం వంటి పరిస్థితులు నెలకొన్నాయన్న విమర్శలున్నాయి. ఎన్హెచ్ఎం నిధుల్లో కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయించాల్సి ఉంది.