బ్యాంకుల దెబ్బ.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఫార్మా రంగం నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండవ సెషన్ లో నష్టాలను చవి జూసిన సెన్సెక్స్ 91 పాయింట్ల నష్టంతో 27,985 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 8,629 వద్ద ముగిసాయి. ఆర్బీఐ కు కాబోయే గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ నియామకం ప్రకటనతో జోష్ మీద ఉంటాయని అంచనాలు జోరుగా సాగాయి. కానీ ప్రారంభంలో ఫ్లాట్ గా ట్రేడ్ అయిన దేశీ సూచీలు క్రమేపీ నష్టాల బాట పడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్ల బలహీనతలు, ఆగస్ట్ డెరివేటివ్స్ ముగింపు లాంటి కీలక అంశాల కారణంగా సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కొద్దిగా కోలుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగాయి. అలాగే ఐటీ, ఫార్మాసెక్టార్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మార్కెట్ ను ప్రభావితం చేపింది. టీసీఎస్, లుపిన్ సన్ ఫర్మా, యాక్సిక్ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. ఐటీసీ, హెచ్ యూఎల్, బీహెచ్ఈఎల్ లాభపడ్డాయి.
అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి బలహీనత కొనసాగుతోంది.ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలతో డాలర్ తోపోలిస్తే రూపాయి 14 పైసల నష్టంతో 67.19 వద్ద ఉంది. బులియన్ మార్కెట్లో వెండి మెరుపులు మెరిపిస్తుండగా, బంగారం నష్టాల్లో ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10గ్రా. పుత్తడి 124రూ నష్టంతో 31, 128 దగ్గర ఉంది.